పాన్‌గల్: ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను నిర్లక్ష్యం చేయొద్దని.. గడువులోగా ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించి అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటును కాపాడుకోవాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో బీఆర్‌ఎస్ కార్యకర్తలు, బీఎల్‌ఏల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీ శ్రేణులు, బీఎల్‌ఏలు సమన్వయంతో పనిచేస్తూ అర్హుల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా జాగ్రత్త పడాలన్నారు. గ్రామాల్లో అందుబాటులో లేని ఓటర్లను ఫోన్ ద్వారా సంప్రదించి వివరాలు సేకరించి ఫారాలు అందించాలని సూచించారు. నియోజకవర్గంలో ఏకంగా 24 వేల డబుల్ ఓట్లు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. మంత్రి జూపల్లి నియోజకవర్గంలో పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మంత్రికి అఽధికార దాహం తప్ప నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని.. వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, పనిచేసే కార్యకర్తలకు తప్పక గుర్తింపు ఉంటుందని భరోసానిచ్చారు. కిష్టాపూర్ సమీపంలో రామన్నగట్టు రిజర్వాయర్ నిర్మాణంతో మండలంలోని సాగు, తాగునీటి ఇబ్బందులు తొలగుతాయని.. చేపట్టే వరకు పార్టీ పోరాడుతుందన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు వీరసాగర్, చంద్రశేఖర్‌నాయక్, సుధాకర్‌యాదవ్, తిలకేశ్వర్‌గౌడ్, రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్‌లో చేరిక..
మండలంలోని శాగాపూర్ 5వ వార్డు సభ్యుడు లక్ష్మీనర్సింహ, మాజీ వార్డు సభ్యుడు కుర్మయ్య మాజీ ఎమ్మెల్యే బీరం సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ నాయకులు తిరుపతయ్యయాదవ్, కృష్ణయ్యయాదవ్, డా. తిరుపతయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


