రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

Jul 8 2026 1:20 AM | Updated on Jul 8 2026 1:20 AM

ఆత్మకూర్‌/అమరచింత: రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నారని రాష్ట్ర పశుసంవర్ధక, డైరీ అభివృద్ది, క్రీడలు, యువజన, మత్స్యశాఖ మంత్రి డాక్టర్‌ వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం ఆత్మకూర్‌, అమరచింత మండలాల్లో రాష్ట్ర కల్లు గీత సహాకార సంఘం వైస్‌ చైర్మన్‌ కేశం నాగరాజుగౌడ్‌తో కలిసి మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఆత్మకూర్‌ మార్కెట్‌ యార్డులో రూ.85 లక్షలతో నూతన భవన నిర్మాణానికి, అమరచింత మండలంలోని చంద్రగఢ్‌ ఎత్తిపోతల పథకం మరమ్మతుల కోసం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూరాల గ్రామం వద్ద రూ.122 కోట్ల నిధులతో బ్రిడ్జి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ఆత్మకూర్‌లో 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రి భవన నిర్మాణం త్వరలోనే ప్రారంభం అవుతాయన్నారు. చంద్రగఢ్‌, బెక్కర్‌పల్లి, నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతల మరమ్మతుల కోసం 6.60 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకులు ఓర్వలేక అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

మంత్రితో రైతు వాగ్వాదం..

చెరువులను నింపుతామని అమరచింత లిఫ్టుకు రూపకల్పన చేశారని, అలాంటిది లిఫ్టు నీటితో చెరువులను నింపకుండా రైతులను ఆగం చేస్తున్నారని స్థానిక రైతు వెంకటయ్య మంత్రి వాకిటి శ్రీహరితో వాగ్వాదానికి దిగారు. నాగిరెడ్డిపల్లిలో చెరువు నీటితో కొందరికి మాత్రమే ప్రయోజనం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారం చేపట్టి రెండున్నరేళ్లు దాటినా మిట్టనందిమళ్ల రోడ్డు మరమ్మతు చేస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చట్లేదని గ్రామస్తులు నిలదీశారు. దీంతో సభలో కాస్త గందరగోళం మారింది. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌, ఆర్డీఓ సుబ్రమణ్యం, ఆత్మకూర్‌ మార్కెట్‌ చైర్మన్‌ రహ్మతుల్లా, పురచైర్‌పర్సన్‌ నాగమణి, వైస్‌చైర్మన్‌ నల్గొండ శ్రీను, రాజేందర్‌ రెడ్డి, చుక్క ఆశిరెడ్డి, సర్వారెడ్డి, వెంకట్‌ రెడ్డి, రవికాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement