వనపర్తి: పంచాయతీల సమగ్ర అభివృద్ధి, 16వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం, పరిపాలనా అంశాలపై జిల్లాలో సర్పంచులకు పకడ్బందీ ప్రణాళికతో శిక్షణా తరగతులు నిర్వహిస్తామని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖీమ్యానాయక్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్ నుంచి జీపీ సాప్ అమలు, పరిపాలనా అంశాలపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ కాన్ఫరెన్స్‌కు జిల్లా నుంచి హాజరైన అదనపు కలెక్టర్ జిల్లా పరిస్థితులను మంత్రికి వివరించారు. అనంతరం జిల్లా అధికారులతో సమావేశమైన ఆయన గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికలు ప్రజల అవసరాలకు అనుగుణంగా రూపొందించాలని, గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, అంతర్గత రహదారులు, వీధి దీపాలు, మురుగు నీటి పారుదల, హరితహారం, ప్రజా వసతులు వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. బుధవారం నుంచే జిల్లాలో మూడు రోజుల పాటు ఏర్పాటు చేయనున్న శిక్షణ తరగతులకు సర్పంచులు అందరూ విధిగా హాజరు కావాలన్నారు. వీబీ జీ రామ్ జీ చట్టంపై ప్రతి సర్పంచ్, కార్యదర్శికి పూర్తిస్థాయి అవగాహన ఉండాలి. సమావేశంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి, డీపీఓ రఘునాథ్‌రెడ్డి, అధికారులు ఉన్నారు.


