నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు

Jul 8 2026 1:20 AM | Updated on Jul 8 2026 1:20 AM

పాన్‌గల్‌: మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న ఏడు రకాల వరి సన్న విత్తనాలను కొనుగోలు చేసిన రైతుల వివరాలను ఆన్‌లైన్‌ లైసెన్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఓఎల్‌ఎమ్‌ఎస్‌)లో తప్పక నమోదు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు ఆదేశించారు. మంగళవారం మండలంలోని దొండాయిపల్లి రైతువేదికలో పాన్‌గల్‌ డివిజన్‌ స్థాయి ఓఎల్‌ఎమ్‌ఎస్‌పై విత్తన డీలర్లకు నిర్వహించిన శిక్షణ, సమీక్ష సమావేశంలో డీఏఓ పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని రైతుల అవసరాలకు అనుగుణంగా మినుము, కంది, జొన్న తదితర ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను తగిన నిల్వలో అందుబాటులో ఉంచుకోవాలని ఆయన డీలర్లకు సూచించారు. రైతులు ఎప్పుడూ ఒకే రకమైన పంటనే సాగు చేయకుండా ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలన్నారు. రైతులు విత్తనం, ఎరువులు కొనుగోలు చేసిన సమయంలో తప్పక రశీదు తీసుకోవాలన్నారు. గడువు తీరిన, నకిలీ విత్తనాలు విక్రయిస్తే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఏఓ మణిచందర్‌, చిన్నంబావి, వీపనగండ్ల మండలాల ఏఓ డాకేశ్వర్‌గౌడు, బీటీఎం సునీత, విత్తన డీలర్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement