అమ్మ పేరుతో మొక్కలు నాటి పెంచుదాం | - | Sakshi
Sakshi News home page

అమ్మ పేరుతో మొక్కలు నాటి పెంచుదాం

Jun 21 2026 8:22 AM | Updated on Jun 21 2026 8:22 AM

కొత్తకోట/మదనాపురం: చెట్లు తల్లివంటివని.. ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ సభ్యురాలు డీకే అరుణ పిలుపునిచ్చారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా కొత్తకోట బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం విద్యార్థులతో కలిసి ఆమె మొక్కలను నాటారు. అనంతరం పాఠశాల తరగతి గదులను పరిశీలించి.. విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక వసతులను తెలుసుకున్నారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. నానాటికీ అడవుల విస్తీర్ణం తగ్గిపోవడంతో అతివృష్టి, అనావృష్టి నెలకొని తీవ్ర నష్టం చేకూరుతోందన్నారు. మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ ఆధారపడి ఉందన్నారు. భవిష్యత్‌ తరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పెంచాలని కోరారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి.. మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిందన్నారు. ప్రస్తుతం యువత, విద్యార్థులు సెల్‌ఫోన్‌కు బానిసగా మారుతున్నారని.. ఇది అత్యంత ప్రమాదకరమని అన్నారు. పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.

● పంటల సాగులో రైతులు రసాయనిక ఎరువుల వినియోగాన్ని పూర్తిగా తగ్గించి.. సేంద్రియం సాగు దిశగా అడుగులు వేయాలని ఎంపీ డీకే అరుణ సూచించారు. మదనపురం కృషివిజ్ఞాన కేంద్రంలో సేంద్రియ వ్యవసాయంపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భూములు నిస్సారం కావడానికి మితిమీరిన రసాయనాల వాడకమే కారణమన్నారు. పంట పొలాలు సారవంతంగా ఉండేందుకు సేంద్రియ ఎరువులను వినియోగించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల వ్యవసాయ సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్‌రెడ్డి, డోకూర్‌ పవన్‌కుమార్‌రెడ్డి, లోకనాథ్‌రెడ్డి, కొండ ప్రశాంత్‌రెడ్డి, కొమ్ము భరత్‌ భూషణ్‌, దాబా శ్రీను, శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్‌ గాయత్రి సత్యంసాగర్‌, నారాయణమ్మ, వెంకట్‌రెడ్డి, నరేందర్‌గౌడ్‌, బీజేపీ మండల అధ్యక్షుడు వంగూరు రామకృష్ణారెడ్డి, పద్మజారెడ్డి, అనుజ్ఞారెడ్డి, నారాయణమ్మ, నవీన్‌కుమార్‌రెడ్డి, రాములుయాదవ్‌, మాధవరెడ్డి, వెంకటేశ్వరశెట్టి తదితరులు పాల్గొన్నారు.

మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement