ఇళ్లగణన గడువులోగా పూర్తికావాలి : కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

ఇళ్లగణన గడువులోగా పూర్తికావాలి : కలెక్టర్‌

May 24 2026 12:27 AM | Updated on May 24 2026 12:27 AM

వనపర్తి: జనగణన–2027లో భాగంగా ఇళ్లగణన ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి చార్జ్‌ అధికారులు, అదనపు చార్జ్‌ అధికారులు, సూపర్‌వైజర్లతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చార్జ్‌ అధికారులు ఎన్యూమరేటర్లతో సమన్వయం చేసుకుంటూ ఇళ్లగణన ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఎన్యూమరేటర్లు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించి సర్వే ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని కోరారు. ఇళ్లగణనలో ఒక్క ఇల్లు కూడా తప్పిపోకుండా ఎన్యూమరేటర్లు పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించాలని ఆదేశించారు. ఇళ్లగణన జూన్‌ 9లోగా పూర్తి చేయాలని కోరారు. సెన్సెస్‌ ప్రక్రియ ప్రభుత్వానికి అత్యంత కీలకమైన కార్యక్రమమని.. అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ సూచించారు. సమావేశంలో స్థానిక సంస్థల అ దనపు కలెక్టర్‌ ఎన్‌.ఖీమ్యానాయక్‌, సైన్‌న్స్‌ అధికారి శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

గణప సముద్రం నిర్వాసితులకు పరిహారం

ఖిల్లాఘనపురం: మండలంలోని గణప సముద్రం రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం ఎట్టకేలకు పరిహారం విడుదల చేసింది. మొత్తం 388 ఎకరాలకుగాను రూ.42,13,74,661 విడుదలైనట్లు ఖిల్లా వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ క్యామ నవనీత, సింగిల్‌విండో చైర్మన్‌ కె.మురళీధర్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ఉపాధ్యక్షుడు టి.సాయిచరణ్‌రెడ్డి తెలిపారు. ఎక్కడా అవినీతికి తావు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమ అయినట్లు చెప్పారు. నిధుల విడుదల సందర్భంగా శనివారం మండల కేంద్రంలోని బస్టాండ్‌ సమీపంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చిత్రపటాలకు వారు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రైతులకు ఇచ్చిన మాట కోసం ముఖ్యమంత్రి, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రిని నిరంతరం కలిసి నిధుల విడుదలకు కృషి చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, వ్యవసాయశాఖ మంత్రులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు విజయ్‌కుమార్‌, పెద్దలు ఆగారం ప్రకాష్‌, క్యామ రాజు, గంజాయి రమేష్‌, నారాయణ, లింగస్వామి, శ్రీరాములు, రజినీకాంత్‌, నరేష్‌, బుచ్చిరెడ్డి, యాదగిరి, ముజాహిద్‌, హజీం, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

విధుల్లో నిర్లక్ష్యం సరికాదు

ఆత్మకూర్‌: వార్డు అధికారులు, సిబ్బంది విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని పుర కమిషనర్‌ చికినె శశిధర్‌ హెచ్చరించారు. శనివారం స్థానిక పుర కార్యాలయంలో వార్డు అధికారులు, మెప్మా ఆర్పీలు, సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిత్యం వార్డుల్లో పర్యటించి ఇంటి, కొళాయి పన్నులు వసూలు చేయాలని, తడి, పొడిచెత్త వేర్వేరుగా ఇచ్చే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కొందరు చెత్తను రోడ్లు, డ్రైనేజీల్లో పారబోస్తున్నారని.. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. నేషనల్‌ ఫ్యామిలీ బెనిఫిట్‌ స్కీంలో అర్హులను గుర్తించి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలన్నారు. స్వచ్ఛతలో పారుశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకమని.. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వాటర్‌మెన్‌లు నిత్యం అందుబాటులో ఉండి తాగునీటి సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని, స్థానికుల నుంచి ఫిర్యాదులు అందితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement