పైప్‌లైన్‌లో తరలించాలి..
నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి డీ–5 కాల్వకు నీటిని తరలించేందుకు 338.5 ఎఫ్‌ఆర్‌ఎల్ లెవల్‌లో స్లూయిస్ ఏర్పాటు చేశారు. అక్కడే 318 ఎఫ్‌ఆర్‌ఎల్ లెవల్‌లో పైప్‌లైన్ నిర్మాణం చేపట్టి జీల్దార్‌తిప్ప చెరువు సమీపంలో 304 లెవల్‌లో నీటిని విడుదల చేయాలి. అక్కడి నుంచి ఆయకట్టు భూములుకు నీళ్లు పారించేందుకు మైనర్ కాల్వలు ఉన్నాయి.
– వెంకట్‌రెడ్డి, నిర్వాహకుడు,
గ్రామాభ్యుదయ సేవా సంస్థ ఎల్లూరు
ఉన్నతాధికారుల పరిశీలనలో..
జీల్దార్‌తిప్ప చెరువుకు నీటి తరలింపు అంశం ఉన్నతాధికారుల పరిశీలనలో ఉంది. మొదట మొలచింతలపల్లి వాగు వద్ద లిఫ్టు ఏర్పాటు చేయాలని, తర్వాత కేఎల్‌ఐ, పాలమూరు ప్రాజెక్టుల నుంచి కాల్వల ద్వారా నీటిని తరలించాలని నిర్ణయించారు. కానీ, కాల్వలు తవ్వేందుకు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. పైప్‌లైన్ ఏర్పాటు అంశం కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉంది.
– అమర్‌సింగ్, డీఈ, నీటిపారుదలశాఖ
కొల్లాపూర్: కేఎల్‌ఐ, పాలమూరు ప్రాజెక్టులకు కూతవేటు దూరంలోనే ఉన్న జీల్దార్‌తిప్ప చెరువుకు కృష్ణానదీ నీటిని తరలించే ప్రక్రియ ఏళ్ల తరబడి ప్రకటనలు, శిలాఫలకాలకే పరిమితమవుతోంది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని ముక్కిడిగుండం, గేమ్యానాయక్‌తండా, మొలచింతలపల్లి, ఎర్రగట్టుబొల్లారం గ్రామాలు కేఎల్‌ఐ, పాలమూరు ప్రాజెక్టులకు సమీపంలోనే ఉంటాయి. లక్షలాది ఎకరాలకు నీరందించే ప్రాజెక్టులు పక్కనే ఉన్నా ఆ గ్రామాలకు మాత్రం సాగునీరు అందడం లేదు. నల్లమల అటవీ ప్రాంతంలో దశాబ్దాల క్రితం నిర్మించిన జీల్దార్‌తిప్ప చెరువుపైనే నేటికీ ఆయా గ్రామాల రైతులు ఆధారపడుతున్నారు. చెరువు నిండితేనే రెండు పంటలు పండిస్తారు. లేదంటే ఒక్క పంటతోనే సరిపెట్టుకోవాలి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు జీల్దార్‌తిప్ప చెరువుకు కృష్ణానది నీటిని తరలించాలని పాలకులు భావించారు. ఇందుకోసం నిధులు మంజూ రుచేసి, శంకుస్థాపనలు కూడా చేశారు. కానీ, పనులు మాత్రం ఇప్పటివరకు ప్రారంభం కాలేదు.
● కృష్ణానది నీటిని మొలచింతపల్లి, ముక్కిడిగుండం గ్రామాల్లోని పంటపొలాలకు అందించాలనే ఉద్దేశంతో 2004లో రూ.3 కోట్లతో కృష్ణా బ్యాక్‌వాటర్‌పై మినీ లిఫ్టు నిర్మించేందుకు శిలాఫలకం వేశారు. కానీ పనులు చేపట్టలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మరోసారి మొలచింతలపల్లి, ముక్కిడిగుండం గ్రామ పొలాలకు సాగునీరు మళ్లించాలనే అంశం తెరపైకి వచ్చింది. 2019లో కేఎల్‌ఐ నుంచి జీల్దార్‌తిప్ప చెరువుకు నీటిని తరలించేందుకు రూ.19 కోట్లు కేటాయించగా.. అదే సంవత్సరం మార్చిలో పనులు చేపట్టేందుకు శంకుస్థాపన చేశారు. కానీ భూసేకరణకు నిధులు సరిపోవనే సాకుతో పనులు ముందుకు సాగలేదు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రూ.35 కోట్లతో మరోసారి నీటి తరలింపు పనులకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ రద్దుచేసి నూతన ప్రతిపాదనలు తయారు చేసింది.
జీల్దార్‌తిప్ప చెరువు
కృష్ణా నీటికి నోచుకోని మొలచింతలపల్లి, ముక్కిడిగుండం గ్రామాల రైతులు
కేఎల్‌ఐ, పాలమూరు ప్రాజెక్టుల పక్కనే ఉన్నా అందని సాగునీరు
నీటి తరలింపునకు
రెండుసార్లు శంకుస్థాపన
పైప్‌లైన్ ద్వారా తరలింపు..
కేఎల్‌ఐ ప్రాజెక్టులోని డీ–5 కాల్వకు అనుసంధానంగా కాల్వలు తవ్వాలని గతంలో అధికారులు నిర్ణయించారు. డీ–5 కాల్వ పాలమూరు ప్రాజెక్టులోని నార్లాపూర్ రిజర్వాయర్‌లో మునిగిపోతోంది. దీంతో ఇప్పుడు నార్లాపూర్ రిజర్వాయర్‌కు అనుసంధానంగానే నీటి తరలింపు చేపట్టాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. కాల్వలు తవ్వేందుకు అటవీ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని, కాల్వలకు బదులుగా ప్రెజర్‌మెయిన్స్ ఏర్పాటు చేసి.. పైప్‌లైన్లతో నీటిని జీల్దార్‌తిప్ప చెరువుకు తరలిస్తే బాగుంటుందని ప్రతిపాదించారు. దీనిపై నివేదిక అందజేసిన అధికారులు తర్వాత ప్రక్రియపై దృష్టి సారించడం లేదనే ఆరోపణలున్నాయి. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి జీల్దార్‌తిప్పకు వెళ్లే మార్గంలో పెద్దవాగు, ఉడుములు వాగు, చిన్నవాగులు ప్రవహిస్తుంటాయి. వీటిమీదుగా కాల్వల నిర్మాణాలు ఖర్చుతో కూడిన వ్యవహారం. పైగా కాల్వల కోసం భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేని ఇక్కడి రైతులు పైప్‌లైన్ ద్వారా నీటిని తరలించాలని కోరుతున్నారు.


