గోపాల్‌పేట: రవాణా ఏజెన్సీపై చర్యలు తీసుకొని మార్చాలని, తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలంటూ శుక్రవారం గోపాల్‌పేటలో రైతులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మడి గోపాల్‌పేట మండలంలోని ఏదుట్ల, ఏదుల, చెన్నారం, సమీప గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని గోపాల్‌పేటలోని గోదాంకు తరలించాలని నిర్వాహకులు సూచించడంతో రైతులంతా ఒక్కసారిగా ధాన్యం ట్రాక్టర్లతో తీసుకొచ్చారు. దీంతో సుమారు కిలోమీటర్ మేర ట్రాక్టర్లు నిలిచాయి. గోదాంలో ధాన్యం దింపేందుకు కేవలం ఎనిమిది మంది హామాలీలు మాత్రమే ఉండటం.. ట్రాక్టర్లు రోడ్డు పక్కన ఉంచి లారీలు, డీసీఎంలలో వచ్చిన ధాన్యం మొదట దింపడంతో ఎన్నిరోజుల పాటు ధాన్యం దించుతారని రైతులు ఆగ్రహానికి గురయ్యారు. దీనికితోడు గోదాంకు సంబంధించిన కాంట్రాక్టర్ బస్తాకు అరకిలో తరుగు తీయాలని చెప్పడంతో రైతులు సాయంత్రం నాలుగు నుంచి గోదాం ఎదురుగా ఉన్న బీటీరోడ్డుపై ధర్నాకు దిగారు. వీరికి బీఆర్‌ఎస్ నాయకులు మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొన్నారు. 20 మంది హమాలీలు బస్తాలు దింపేందుకు వస్తే తిప్పి పంపారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ఎన్నిరోజులు పడిగాపులు పడాలి.. కొనుగోలు చేసిన తర్వాత మిల్లులకు తరలించేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోందని.. సొంతంగా ట్రాక్టర్లలో తీసుకొస్తే దింపేందుకు హమాలీలు కూడా అందుబాటులో ఉండటం లేదని మండిపడ్డారు. వెంటనే కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలంటూ భీష్మించుకు కూర్చున్నారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ శశిధర్, తహసీల్దార్ తిలక్‌కుమార్‌రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడి ధర్నా విరమించాలని కోరారు. కలెక్టర్ వచ్చి రవాణా ఏజెన్సీపై చర్యలు తీసుకొని మార్చాలని, తరుగు లేకుండా ధాన్యం సేకరించాలని డిమాండ్ చేశారు. సాయంత్రం ఏడు వరకు జేసీ వస్తారని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. రాత్రి 7.30 గంటలకు రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్ వచ్చి రైతులతో మాట్లాడారు. శనివారం నుంచి హమాలీల సంఖ్య పెంచుతామని, అలాగే ట్రాక్టర్లలో ఉన్న ధాన్యం మొదట దింపేలా చూస్తామని హామీ ఇచ్చారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ హామీతో విరమణ


