అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి | - | Sakshi
Sakshi News home page

అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి

May 23 2026 12:28 AM | Updated on May 23 2026 12:28 AM

వనపర్తి: ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ.. బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి ఆయనతో పాటు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, ఎస్పీ సునీత హాజరయ్యారు. కార్యక్రమాన్ని తెలంగాణ గీతాన్ని ఆలపించి ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగాన్ని చదివి వినిపించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సమాజాన్ని పట్టిపీడిస్తున్న దళారీ వ్యవస్థను పూర్తిగా అంతం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజల అర్జీలను ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయొద్దని.. వేగంగా పరిష్కార మార్గం చూపాలని కోరారు. విద్య, వైద్యంపై దృష్టి సారించి వీటికే అధిక నిధులు కేటాయించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. భూములకు సంబంధించి రైతుల నుంచి వచ్చే అర్జీలను వేగంగా పరిష్కరించాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రతి వ్యక్తికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో 65 ఏళ్లలో రూ.65 వేల కోట్ల అప్పు చేస్తే.. గత పాలకులు తొమ్మిదేళ్లలో రూ.8 లక్షల కోట్ల అప్పుచేసి రాష్ట్రాన్ని తిరోగమనంవైపు తీసుకెళ్లారని ఆరోపించారు.

రూ.28 కోట్ల వడ్డీలేని రుణాలు..

జిల్లాలోని 8,258 స్వయం సహాయక సంఘాలకు రూ.28 కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసినట్లు కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి తెలిపారు. మహిళలకు 97,076 ఇందిరమ్మ చీరలు, 70,516 మందికి చేయూత పింఛన్లు అందిస్తున్నట్లు చెప్పారు. విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించామని.. పదోతరగతి ఫలితాల్లో గతేడాదితో పోలిస్తే మెరుగైన స్థానాన్ని సాధించామని, 97 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 19వ స్థానంలో నిలిచినట్లు వివరించారు.

రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

Advertisement
 
Advertisement
Advertisement