మిల్లర్ల మాయ జాలం!
మిల్లుల్లో కనిపించని సీజ్ చేసిన ప్రభుత్వ ధాన్యం
● కస్టోడియన్ల నిర్లక్ష్యంతో రూ.కోట్ల విలువైన వడ్లు పక్కదారి?
● టాస్క్‌ఫోర్స్ అధికారుల తనిఖీల్లో బట్టబయలు.. మరో కేసు నమోదు
● జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేస్తే
మరిన్ని వెలుగులోకి వచ్చే అవకాశం
●
25వేల బస్తాలు ముందే తరలించాం..
పెద్దమందడి మండలంలోని రెండు మిల్లులను టాస్క్‌ఫోర్స్ అధికారులు సీజ్ చేసిన కొంత కాలానికి, నేను డీఎంగా ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహించిన సమయంలో సుమారు 25 వేల బస్తాలను షిఫ్ట్ చేశాం. గతంలో ఇక్కడ పనిచేసిన డీఎంకు కేసు నమోదు చేసిన సమయంలో బ్యాలెన్స్ ధాన్యం వేలం వేయాలని పంచనామాలో రాశాం. కానీ సదరు అధికారి వేలం వేయలేదు. – కాశీవిశ్వనాథ్, డీఎస్‌ఓ
పరిశీలిస్తాం..
జిల్లావ్యాప్తంగా సీజ్ చేసిన మిల్లుల్లో ధాన్యం నిల్వల పరిశీలన చేస్తాం. ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లలో బిజీగా ఉన్నాం. కస్టోడియన్లు ధాన్యం భద్రతా అంశాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్లు, లోకల్ రెవెన్యూ అధికారులకు కస్టోడియన్ ఇస్తాం. పెద్దమందడి మండలంలోని రెండు మిల్లుల కస్టోడియన్ ఎవరూ.. ధాన్యం ఎక్కడికి తరలించారు. ఎవరు తరలించారనే అంశాలను పరిశీలిస్తాం.
– వినోద్‌కుమార్, అదనపు కలెక్టర్ (రెవన్యూ)
వనపర్తి: సీజ్ చేసిన రైస్‌మిల్లుల్లోని వరిధాన్యం మాయం కావడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. రూ.కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యాన్ని భద్రపర్చాల్సిన అధికారుల నిర్లక్ష్యంతో మిల్లులకు వేసిన సీజ్‌లు అలాగే ఉండగానే.. ధాన్యం మాయం కావడం సంచలనం రేపుతోంది. కొన్ని నెలల క్రితం పెద్దమందడి మండలంలోని రెండు మిల్లుల్లో ఉండాల్సిన ధాన్యం కంటే తక్కువగా నిల్వలు ఉన్నాయని అందిన సమాచారం మేరకు రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ అధికారులు సుదీర్ఘంగా తనిఖీలు చేపట్టారు. ధాన్యం నిల్వల్లో భారీగా తేడా ఉండటంతో కేసు నమోదు చేసి.. రెండు మిల్లులను సీజ్ చేశారు. అయితే ఆయా మిల్లుల్లో ఉండాల్సిన ధాన్యం పెద్దమొత్తంలో మాయమైనట్లు అందిన సమాచారం మేరకు తాజాగా మరోసారి తనిఖీలు చేపట్టారు. రెండు రోజులపాటు పలు దఫాలుగా తనిఖీలు నిర్వహించగా.. మిల్లుల్లోని ధాన్యం మాయమైనట్లు తేలడంతో మరో కేసు నమోదు చేసినట్లు తెలిసింది.


