యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి

May 22 2026 12:36 AM | Updated on May 22 2026 12:36 AM

వనపర్తి/వనపర్తి రూరల్‌: క్రీడలు శారీరక దారుఢ్యంతోపాటు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని.. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా.జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న క్రీడా వారోత్సవాల సందర్భంగా గురువారం జిల్లా పోలీసు కార్యాలయ మైదానంలో క్రికెట్‌ టోర్నీ నిర్వహించగా.. పోలీసు, రెవెన్యూ, ప్రెస్‌ మీడియా, ఉపాధ్యాయ జట్లు ఉత్సాహంగా పాల్గొన్నాయి. ఈ పోటీల్లో పోలీసు జట్టు విజేతగా నిలవగా.. ఉపాధ్యాయుల జట్టు రన్నరప్‌గా నిలిచింది. రెవెన్యూ జట్టు తరఫున కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి స్వయంగా ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అదనపు ఎస్పీ రాజేశ్‌ మీనా పోలీసు జట్టుకు నాయకత్వం వహించి అర్ధశతకం సాధించారు. టోర్నీ విజేత, రన్నరప్‌ జట్లకు చిన్నారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి, డీఐజీ ఎల్‌ఎస్‌ చౌహాన్‌, కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, ఎస్పీ సునీతారెడ్డి చేతులమీదుగా ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం క్రీడలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గ్రామీణ మట్టిలో మాణిక్యాలను వెలికితీసి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. శారీరక దారుఢ్యం క్రీడలతోనే సాధ్యమని.. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక క్రీడా వారోత్సవాల్లో భాగంగా క్రికెట్‌ టోర్నీ నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఏఆర్‌ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీవైఎస్‌ఓ సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా.చిన్నారెడ్డి

పెబ్బేరు పట్టణంలోని ఖేలో ఇండియా ఫుట్‌బాల్‌ మైదానంలో కలెక్టర్‌ ప్రత్యేక నిధులు రూ. 10లక్షలతో ఏర్పాటుచేసిన నూతన ఫ్లడ్‌లైట్లను ఎమ్మెల్యే మేఘారెడ్డి, కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, శాట్‌ చైర్మన్‌ శివసేనారెడ్డితో కలిసి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ప్రారంభించారు. ఇదే మైదానంలో ఎమ్మెల్యే నిధులు రూ. 10లక్షలతో నిర్మించనున్న డ్రెసింగ్‌ రూమ్‌, జిమ్‌, టాయిలెట్స్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. యువతకు క్రికెట్‌ కిట్లు పంపిణీ చేశారు. అనంతరం ఫుట్‌బాల్‌ పోటీలను వారు ప్రారంభించగా.. వనపర్తి, గోపాల్‌పేట, పెబ్బేరు, ఆత్మకూర్‌ జట్లు ఫుట్‌బాల్‌ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నాయి. కార్యక్రమంలో పెబ్బేరు ఫుట్‌బాల్‌ క్లబ్‌ అధ్యక్షుడు కృష్ణకుమార్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ సుమిత్ర, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గౌని ప్రమోదిని, వైస్‌చైర్మన్‌ ఎద్దుల విజయవర్ధన్‌రెడ్డి, కౌన్సిలర్‌ శివసాయి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement