మక్తల్‌ను అన్నిరంగాల్లో తీర్చిదిద్దుతా | - | Sakshi
Sakshi News home page

మక్తల్‌ను అన్నిరంగాల్లో తీర్చిదిద్దుతా

May 22 2026 12:36 AM | Updated on May 22 2026 12:36 AM

19 బీటీరోడ్ల నిర్మాణానికి రూ.68కోట్లు మంజూరు

త్వరలోనే 150 పకడల ఆస్పత్రి

అందుబాటులోకి

రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి

మక్తల్‌: నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో తీర్చిదిద్దడమే తన లక్ష్యమని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం మక్తల్‌లో అసంపూర్తి భవనాలను ఆయన పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 19 బీటీరోడ్లను 65 కి.మీ. మేర నిర్మించేందుకు రూ. 68కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. కొల్పూర్‌ – కుర్తికొండ వద్ద జూరాల ప్రాజెక్టు తరహాలో బ్రిడ్జి కమ్‌ బ్యారేజీ నిర్మించేందుకు అవసరమైన నిధుల మంజూరుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. హిందూపూర్‌ వద్ద ఽథర్మల్‌ పవర్‌ స్టేషన్‌కు సైతం త్వరలో గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే మక్తల్‌లో డిగ్రీ కళాశాల, రిజిస్ట్రర్‌ కార్యాలయం, కోర్టు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మక్తల్‌ మండలంలోని గొల్లపల్లి –మంతన్‌గోడ్‌ బీటీరోడ్డు నిర్మాణానికి రూ. 1.50కోట్లు, చిట్యాల – గుర్రందొడ్డి మార్గంలో వంతెన నిర్మాణానికి రూ. 20కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. మక్తల్‌లో నిర్మిసు న్న 150 పడకల ఆస్పత్రిని త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అదే విధంగా 220 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌, టౌల్‌ హాల్‌ నిర్మాణాలకు కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

రాజీవ్‌గాంధీ ఆశయసాధనకు కృషి..

దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ దేశానికి అందించిన సేవలు మరువలేనివని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్బంగా మక్తల్‌లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యువత శక్తిపై అపారమైన విశ్వాసం ఉంచిన రాజీవ్‌ గాంధీ.. 18 ఏళ్ల వయసు నుంచే ఓటు హక్కు కల్పించి, ప్రజాస్వామ్య వ్యవస్థల్లో యువశక్తి ప్రాధాన్యం పెంచారన్నారు. రాజీవ్‌గాంధీ ఆశయాలను కాంగ్రెస్‌ ప్రబుత్వం ముందుకు తీసుకెళ్తుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో యువత అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ గణేశ్‌కుమార్‌, నాయకులు వాకిటి హన్మంతు, కట్ట సురేశ్‌, ఫయాజ్‌, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, కావాలి తయాప్ప, రవికుమార్‌, మందుల నరేందర్‌, ఆనంద్‌గౌడ్‌, నర్సింహులు, గణేశ్‌, ఓబులేషు, వెంకటేశ్‌, లక్ష్మణ్‌, శ్యామ్‌, రవి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement