వనపర్తి: వనమహోత్సవంలో భాగంగా ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా 20,60,900 మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో వనమహోత్సవంపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాఖల వారీగా కేటాయించిన లక్ష్యాలను సకాలంలో పూర్తిచేసేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. వచ్చేనెలలో వర్షాలు పడిన వెంటనే మొక్కలు నాటడం ప్రారంభించాలన్నారు. ముఖ్యంగా ఎవెన్యూ ప్లాంటేషన్‌పై ప్రత్యేక దృష్టిసారించాలని.. పండ్ల మొక్కలు, ఈత, మునగ వంటి మొక్కలు అధికంగా నాటాలన్నారు. అదే విధంగా నాటిన ప్రతి మొక్కను జియో ట్యాగింగ్ చేయాలని తెలిపారు.
● పని కావాలని అడిగే ప్రతి కూలీకి ఉపాధి హామీ పథకం పనులు కల్పించాలని అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. వేసవి తీవ్రత దృష్ట్యా కూలీలు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు పనులను ముగించుకొని వెళ్లిపోవచ్చన్నారు. పని ప్రదేశాల్లో కూలీలకు చలువ నీడ, మంచినీరు, ఓఆర్‌ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాలని సిబ్బందికి సూచించారు. ఉపాధి హామీ పథకంలో పని దినాల సంఖ్య పెంచితే.. గ్రామ పంచాయతీలకు సీసీరోడ్లు నిర్మించుకోడానికి మెటీరియల్ కాంపోనెంట్ పెరుగుతుందని తెలిపారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి ఉన్నారు.
చారిత్రక కట్టడాలపరిరక్షణ అందరి బాధ్యత
కొల్లాపూర్ రూరల్: చారిత్రక కట్టడాల పరిరక్షణ మన అందరి బాధ్యత అని జిల్లా పర్యాటక శాఖ అధికారి నర్సింహ అన్నారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని సోమశిల గ్రామంలో ఉన్న పురాతన, ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంలో ఉపాధి హామీ కూలీలతో కలిసి గ్రామ సమీపంలో నుంచి సోమేశ్వరాలయం వరకు హెరిటేజ్ వాక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమశిల గ్రామానికి జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు ఉందని, గ్రామంలో పురాతన కట్టడాలు ఎన్నో ఉన్నాయని, మన సంపదను కాపాడుకోవాల్సి బాధ్యత మనదేనని స్పష్టం చేశారు. ఉపాధి హామీ కూలీలకు లలితా సోమేశ్వరాలయం గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకటలక్ష్మి, మాజీ సర్పంచ్ మద్దిలేటి, పురాతన శాఖ పర్యవేక్షకుడు కుర్మయ్య, నాయకులు కాటం వెంకటస్వామి, నారాయణ, మౌలాలి తదితరులు పాల్గొన్నారు.


