కుమ్మక్కుతో దందా..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఎండా కాలం సాగుకు సంబంధించి ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కేంద్రాల్లో ఇప్పటివరకు కొనుగోళ్లు అంతంత మాత్రంగానే జరుగుతురన్నాయి. సీజన్ ముగిసే దశకు చేరుకున్నా.. నిర్దేశిత లక్ష్యంలో కనీసం 30 శాతం చేరుకోలేదు. హమాలీలు, లారీల కొరతతోపాటు మిల్లుల్లో స్థలాభావం వంటి కారణాలు కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇది చాలదన్నట్లు రోజుల తరబడి నిరీక్షణతో కష్టనష్టాలకు ఓర్చి సర్కారు సెంటర్లలోనే అమ్ముకుందామనుకున్న రైతులకూ భంగపాటు తప్పడం లేదు. మిల్లర్లు, కేంద్రాల నిర్వాహకులు తాలు పేరిట నిలువు దోపిడీకి తెగబడడంతో వారు గుండెలు బాదుకుంటున్నారు. పాలక పక్షంలో కొరవడిన చిత్తశుద్ధి, అధికారుల తూతూమంత్రపు పర్యవేక్షణతోనే ఈ దుస్థితి నెలకొనగా.. అన్నదాతలు అరిగోస పడుతున్నారు.
కేవలం 2,89 లక్షల మెట్రిక్ టన్నులే..
మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు 1,018 సెంటర్లు కేటాయించారు. ఇందులో 900 వరకు మాత్రమే తెరుచుకున్నాయి. ప్రభుత్వ కేంద్రాల్లో మొత్తంగా 11,49,813 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్ధారించారు. అయితే 19వ తేదీ వరకు ఆయా ప్రభుత్వ కేంద్రాలకు సుమారు 3,42,939 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చింది. ఇందులో ఇప్పటివరకు 2,89,135 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. కేంద్రాల్లో ఇంకా 66,082 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లకు సిద్ధంగా ఉన్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. సరిపోను హమాలీలు లేకపోవడం, లారీల కొరతతో ధాన్యం తరలింపులో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. సెంటర్లలో కొనుగోలు చేసిన ధాన్యంలో సుమారు 33,416 మెట్రిక్ టన్నులను ఇంకా మిల్లులకు తరలించాల్సి ఉండగా.. బస్తాల వద్ద రైతులు రోజుల తరబడి కాపలా కాస్తున్నారు.
జిల్లాల వారీగా ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్ల వివరాలు..
జిల్లా మార్కెట్‌కు కొన్నది ఇంకా మిల్లులకు రసీదు
వచ్చింది కేంద్రాల్లోఉంది తరలించింది ఇచ్చింది
మహబూబ్‌నగర్ 67,420 56,620 10,800 54,338 53,150
వనపర్తి 1,20,000 94,291 36,000 70,000 69,000
నాగర్‌కర్నూల్ 6,500 4,600 2,000 4,028 1,966
జోగుళాంబ గద్వాల 46,019 34,735 11,284 34,462 34,462
నారాయణపేట 1,03,000 98,889 5,998 92,891 91,089
క్వింటాల్‌కు 3 నుంచి 5 కిలోల వరకు మాయాజాలం
రైతులకు కనీస సమాచారం
ఇవ్వకుండానే వ్యవహారం
కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, సిబ్బందితో కుమ్మక్కు
లారీ డ్రైవర్ల పేరు చెబుతూ
పొంతనలేని సమాధానాలు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇంకా
నత్తనడకనే క్రయవిక్రయాలు
తూతూమంత్రపు పరిశీలనలకే
అధికారుల పరిమితం
‘పాన్‌గల్ మండలంలోని గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 20 కేంద్రాల్లో ఇప్పటి వరకు 94,367 బస్తాల ధాన్యం కొనుగోలు చేయగా.. కేవలం 45,716 బస్తాలను మాత్రమే మిల్లులకు తరలించారు. ఇంకా 48,651 బస్తాలు నిల్వ ఉండటంతో రైతులు కేంద్రాల్లోనే పడిగాపులు పడుతున్నారు. సేకరించిన ధాన్యం తరలింపునకు లారీలు సకాలంలో రాకపోవడంతో తూకం చేసిన బస్తాల నిల్వలు భారీగా పేరుకుపోయాయి. అకాల వర్షాలకు ధాన్యం బస్తాలు తడిస్తే ఎవరు బాధ్యత వహించాలని ఆందోళన చెందుతున్నారు. కేంద్రాల్లో ఓ వైపు కొనుగోలు చేసిన ధాన్యం బస్తాల నిల్వలు.. మరోవైపు తూకం చేయని ధాన్యం కుప్పలు పేరుకుపోయాయి. సంబంధిత అధికారులు స్పందించి ధాన్యం తరలింపునకు తగిన చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.’
సెంటర్లలో తూకం వేసిన రసీదు ఉంది.. నేరుగా మిల్లులకు వచ్చిన తర్వాత తూకం ఎలా తక్కువ వస్తుందని ప్రశ్నిస్తే తేమ ఎక్కువగా ఉంది.. ఒప్పుకోకుంటే తీసుకెళ్లండి అంటూ మిల్లుల నిర్వాహకులు తెగేసి చెబుతున్నారు. అంతేకాకుండా రైతులకు సమాచారం ఇవ్వకుండానే మిల్లర్లు బస్తాల సంఖ్యను కుదించి.. ఆ మేరకు బిల్లులు చేస్తున్నట్లు సమాచారం. సెంటర్ల నిర్వాహకులు, మిల్లర్లు కుమ్మకై ్క దందా నడిపిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మద్దతు ధర వస్తుందనే ఆశతో రోజుల తరబడి పడిగాపులు కాచినా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నా.. చివరకు నష్టపోక తప్పడం లేదని ‘సాక్షి’ బృందం పరిశీలన సందర్భంగా పలువురు రైతులు కన్నీటిపర్యంతమయ్యారు.
ప్రభుత్వ కేంద్రాల్లో నిబంధనల ప్రకారం తాలు, బస్తా బరువు పేరిట కిలోన్నర వరకు తరుగు తీస్తున్నారు. కొన్ని చోట్ల రెండు కిలోల చొప్పున కోత పెడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా 41.150 కిలోగ్రాముల చొప్పున బస్తా ధాన్యం తూకం వేసి.. రైతులకు రసీదు ఇస్తున్నారు. ఆ తర్వాత వాటిని లారీలు తదితర వాహనాల్లో కేటాయించిన మిల్లులకు తరలిస్తున్నారు. అక్కడ మిల్లర్లదే హవా నడుస్తుండగా.. రైతుల నడ్డి విరుస్తున్నారు. సెంటర్లలో తూకం వేసినప్పటికీ.. తూకం తక్కువగా వచ్చిందంటూ బస్తాకు అదనంగా కిలోన్నర నుంచి రెండు కిలోల కోత పెడుతూ మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. లారీకి సుమారు 30 బస్తాల చొప్పున (దాదాపు రూ.29 వేలు) కోత పెడుతూ అన్నదాతలను నిలువునా దోచుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో మిల్లులన్నింటిలోనూ ఈ తరహా దందా జరుగుతున్నట్లు తెలుస్తోంది.


