నాణ్యత కరవు..
రెట్టింపైన ధరలు.. బెంబేలెత్తుతున్న ప్రజలు
●
గతంలో రూ.వంద పట్టుకెళ్తే వారానికి సరిపడా కూరగాయలు వచ్చేవి. ప్రస్తుతం ధరలు రెండింతలు అయ్యాయి. టమాటా, పచ్చిమిర్చి, బీరకాయ లాంటి కూరగాయల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయి. ఆదాయం పెరగలేదు కానీ ఖర్చులు మాత్రం రెట్టింపయ్యాయి. ప్రభుత్వం వెంటనే ధరలను అదుపు చేయాలి.
– శ్రావణి, గృహిణి, దంతనూరు, మదనాపురం
రోజువారీ కూలి పనులకు వెళ్లే పేద కుటుంబాలకు ధరల పెరుగుదల భారంగా మారింది. కూరగాయల ధరలు మాంసం ధరలతో పోటీ పడుతున్నాయి. ఆకుకూరల ధరలు కూడా భారీగా పెరగడంతో పిల్లలకు ఏం వండి పెట్టాలో అర్థం కావడం లేదు. ధరలు తగ్గితేనే ఉపశమనం లభిస్తుంది.
– మొగిలి, అజ్జకొల్లు, మదనాపురం
మదనాపురం: సామాన్య ప్రజలు వంటింట్లోకి వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. కూరగాయల ధరలకు ఒక్కసారిగా రెక్కలు రావడంతో మధ్యతరగతి బడ్జెట్ తలకిందులైంది. ఈ మధ్యకాలంలోనే ధరలు రెట్టింపు కావడంతో మార్కెట్‌కు వెళ్లిన వినియోగదారులు అరకొరగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
15 రోజుల కిందట కిలో రూ.30 లభించే టమాట నేడు రెండింతలు కాగా.. చివరకు కొనుగోలుదారు రూ.60 చెల్లించినా నాణ్యమైనవి దొరకడం లేదు. అలాగే క్యాబేజీ రూ.20 నుంచి రూ.35, ఉల్లిగడ్డ రూ.25, బంగాళదుంప రూ.30 నుంచి రూ,40, వంకాయ రూ.30 నుంచి రూ.45, బెండకాయ రూ.40 నుంచి రూ 50, గోరుచిక్కుడు రూ.60, క్యాప్సికం రూ.50 నుంచి రూ.70, బీనన్స్ బీర రూ.70, కాకర రూ.80, రూ.80 నుంచి రూ.100 కిలో అమ్ముతున్నారు. సొరకాయ ఒక్కటి రూ.25 పలుకుతోంది. క్యారెట్, దొండ కిలో రూ.50 నుంచి రూ.60 వరకు విక్రయిస్తున్నారు. ఆకుకూరలు గతంలో రూ.10 పది కట్టలు ఉండగా.. ఇప్పుడు రూ.20కి ఇస్తున్నారు. కొత్తిమీర చిన్న కట్టలు రూ.20కి 4 ఇస్తుండగా.. నిమ్మ, కీర ధరలూ పెరిగాయి. ఎండల తీవ్రతతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఉద్యాన అధికారులు చెబుతున్నారు. ఏటా మే నుంచి జూన్ వరకు ధరలు పెరుగుతూనే ఉంటాయని అభిప్రాయపడుతున్నారు.
గ్రామాల్లోని రైతులు జిల్లాకేంద్రంతో పాటు పట్టణాల్లోని మార్కెట్లకు కూరగాయలు పెద్దగా తీసుకురావటం లేదు. హోల్‌సేల్ వ్యాపారులు ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి స్థానికంగా విక్రయిస్తున్నారు. వీటిల్లో నాణ్యత ఉండటం లేదు. ఎండకు కాత, పూత రావడం లేదని.. అక్కడక్కడ పండిన అరకొర భానుడి దెబ్బకు పాడవుతున్నాయని రైతులు చెబుతున్నారు.
రూ.60కి చేరువలో టమాట,
పచ్చి మిర్చి
సెంచరీ దిశగా అల్లం
ఎండల తీవ్రతతోనే అంటున్న ఉద్యాన అధికారులు


