అన్నదాత.. గుండెకోత | - | Sakshi
Sakshi News home page

అన్నదాత.. గుండెకోత

May 21 2026 12:14 AM | Updated on May 21 2026 12:14 AM

తాలు పేరిట 25 క్వింటాళ్లు దోచుకున్నారు..

తాలు పేరిట మిల్లర్ల నిలువు దోపిడీ

రాత్రింబవళ్లు కష్టపడితే 514 క్వింటాళ్ల ధాన్యం పండింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో స్థానికంగా ఏర్పాటు చేసిన సెంటర్‌లో కొనుగోలు చేసిన తర్వాత ధాన్యాన్ని గాయత్రి మిల్లుకు తీసుకెళ్లాం. అక్కడ మిల్లు నిర్వాహకులు తాలు పేరుతో కొత్త నాటకానికి తెరలేపారు. క్వింటాల్‌కు ఏకంగా 5 కిలోల చొప్పున తరుగు తీస్తేనే అన్‌లోడ్‌ చేస్తామని మొండికేశారు. నిబంధనల ప్రకారం క్వింటాల్‌కు కిలో కంటే ఎక్కువ తరుగు తీయొద్దు. అధికారులకు మొరపెట్టుకున్నా.. ఫలితం లేకుండా పోయింది. వాహన అద్దె భారం మోయలేక.. చేసేదేమీ లేక వారి దోపిడీకి తలవంచాల్సి వచ్చింది. దాదాపు 25 క్వింటాళ్ల పైగా ధాన్యాన్ని ఉచితంగా మిల్లర్ల పాలైంది. మా ఆవేదన ప్రభుత్వానికి వినబడడం లేదు.

– రాజు, అజ్జకొల్లు, మదనాపురం, వనపర్తి

ఫొటోలో ఉంది పెద్ద దర్పల్లిలోని సప్తగిరి పారా బాయిల్డ్‌ రైస్‌ మిల్లు నిర్వాహకులు ఇచ్చిన ట్రక్‌ షీట్‌. మహబూబ్‌నగర్‌ జిల్లా కోయిల్‌కొండ మండలం వింజమూరు ప్రభుత్వ సెంటర్‌లో భీమయ్యయాదవ్‌తో పాటు మరో ఏడుగురు రైతుల నుంచి 856 బస్తాల (342 క్వింటాళ్లు) ధాన్యాన్ని కొనుగోలు చేసి సదరు రైస్‌ మిల్లుకు తరలించారు. అక్కడ తూకం తక్కువగా వచ్చిందంటూ మిల్లర్లు 825 బస్తాలకే లెక్కగట్టారు. ఆ తర్వాత మరో మూడు బస్తాలు కలిపి 331 క్వింటాళ్లకు డబ్బులు చెల్లిస్తామని ఫైనల్‌ చేశారు. అంటే 31 బస్తాలు (11 క్వింటాళ్లు) తక్కువ చూపించారు. ఈ విషయం తెలుసుకున్న సదరు రైతులు మిల్లు నిర్వాహకులను నిలదీశారు. తమకు చెప్పకుండానే ఎలా చేస్తారని ప్రశ్నించారు. సెంటర్ల నిర్వాహకులకు చెప్పామని మిల్లరు తెలపగా.. అక్కడికి వెళ్లారు. వారు లారీ డ్రైవర్‌కు చెప్పామని చేతులు దులుపుకోవడంతో మోసం చేస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆందోళనకు సిద్ధమవుతున్నారు. మరో లారీకి సంబంధించి మోసపూరితంగా ఇలానే 30 బస్తాల కోత పెట్టారని.. సెంటర్లలో నామమాత్రపు తనిఖీలు నిర్వహిస్తున్నారే తప్ప తమకు న్యాయం చేయాలనే స్పృహ అధికారుల్లో కొరవడిందని రైతు భీమయ్య యాదవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement