‘జిల్లాస్థాయి ప్రజాపాలన’కు ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

‘జిల్లాస్థాయి ప్రజాపాలన’కు ఏర్పాట్లు

May 21 2026 12:14 AM | Updated on May 21 2026 12:14 AM

వనపర్తి: ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక జిల్లాస్థాయి కార్యక్రమాన్ని 22వ తేదీన నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జెడ్పీ సీఈఓ యాదయ్యతో కలిసి అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాస్థాయి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహిస్తున్నామని, ప్రతి శాఖ తమకు సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలతో కరపత్రాలు సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై స్పష్టమైన అవగాహన కల్పించే విధంగా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, కుర్చీలు తదితర అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి శాఖ తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.

పోలీసు సేవలు

మరింత చేరువ

వనపర్తి: పోలీసు సేవలు ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జిల్లా పోలీస్‌శాఖ ‘ఆన్‌సైట్‌ ఎఫ్‌ఐఆర్‌’ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని ఎస్పీ సునీతరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదుదారు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. ఘటనా స్థలానికి పోలీసులు వచ్చి ఫిర్యాదును అక్కడే స్వీకరించి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే ఈ విధానంతో బాధితులకు కాస్త ఊరట లభిస్తుందని పేర్కొన్నారు. ఈ విధానంతో ప్రజలకు త్వరితగతిన, పారదర్శక, నమ్మకమైన పోలీసు సేవలు అందనున్నట్లు తెలిపారు. మహిళపై అత్యాచారాలు, చిన్న పిల్లలపై జరిగే నేరాలు, రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు, చోరీలు, గొడవలు, మిస్సింగ్‌ కేసులు, లైంగిక వేధింపులు, బాల్యవివాహాలు, ర్యాగింగ్‌, వృద్ధులు, దివ్యాంగులు, గ్రామీణ ప్రాంత ప్రజలు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న బాధితులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లలేని పరిస్థితుల్లో డయల్‌ 100కు గాని సంబంధిత పోలీసు అధికారికి నేరుగా ఫోన్‌ చేసి సమాచారం అందజేయాలని సూచించారు. దీంతో సమయం ఆదా కావడంతో పాటు కేసుల దర్యాప్తు మరింత వేగంగా, సమర్థవంతంగా కొనసాగనుందని, పోలీసులు ప్రజలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తూ భద్రతా భావన పెంపొందించే అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు.

సురవరం జయంతిని ఘనంగా నిర్వహిస్తాం

వనపర్తి: నియోజకవర్గ తొలి ఎమ్మెల్యే సురవరం ప్రతాప్‌రెడ్డి 130వ జయంతిని ఘనంగా నిర్వహిస్తామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని తన నివాసంలో సాహితీవేత్తలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, మేధావి, సాహితీవేత్త, న్యాయవాదిగా ఆయన సురవం సమాజానికి చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. సురవరం జయంతి ఉత్సవాలకు ముఖ్యఅతిథులుగా వారి జీవితంపై పరిశోధన చేసిన గన్నమరాజు, గిరిజా మనోహర్‌బాబు, సాగునీటిరంగ నిపుణుడు శ్రీధర్‌రావు దేశ్‌పాండేతో పాటు తెలంగాణ అస్తిత్వవాదంతో పాటు రాజకీయ సామాజిక అంశాలు విశ్లేషిస్తున్న సహచర ఉద్యమకారుడు వి.ప్రకాష్‌ను ఆహ్వానిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు గట్టుయాదవ్‌, జిల్లా మీడియా కన్వీనర్‌ నందిమళ్ల అశోక్‌, సాహితీ కళావేదిక అధ్యక్షుడు పలుస శంకర్‌గౌడ్‌, సాహితీవేత్తలు వీరయ్య, బలరాం, బైరోజుచంద్రశేఖర్‌, కిరణ్‌, నాయకులు తిరుమల్లేశ్‌, జోహెబ్‌ హుస్సేన్‌, కుమార్‌, తోట శ్రీను పాల్గొన్నారు.

కురుమూర్తిస్వామి

హుండీ లెక్కింపు

చిన్నచింతకుంట: అమ్మాపురం కురుమూర్తి స్వామికి భక్తులు అమవాస్య, శని, సోమవారాలు పురస్కరించుకొని భక్తులు సమర్పించుకున్న కానుకల హుండీని బుధవారం లెక్కించారు. హుండీ ద్వారా ఆలయానికి రూ.9,10,636 ఆదాయం వచ్చినట్లు ఆలయ చైర్మన్‌ బత్తుల బాల్‌రాజు, ఈఓ మధనేశ్వరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్‌, కమిటీ సభ్యులు మైపాల్‌రెడ్డి, తిరుపత్‌రెడ్డి, వేగనాత్‌, అర్జున్‌, భరత్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement