వనపర్తి: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు బూత్ లేవల్ ఏజెంట్లను నియమించుకొని బీఎల్వోతో సమన్వయం చేసుకునేలా ప్రయత్నించాలని కలెక్టర్ ఆదర్శ సురభి సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 15 నుంచి 24వ తేదీ వరకు సన్నాహక కార్యక్రమాలు, బూత్‌ల మ్యాపింగ్, బీఎల్వోలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ లెవల్ అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించి ఓటర్ల వివరాలను ధ్రువీకరించాల్సి ఉంటుందని.. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించనున్నట్లు వివరించారు. ఆగస్టు 30 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ, సెప్టెంబర్ 28 వరకు వాటి పరిష్కారం చేపట్టి అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ఇంటింటి సర్వే, కొత్త ఓటర్ల నమోదు, మరణించిన, డూప్లికేట్ ఓటర్ల తొలగింపు, చిరునామా మార్పులు వంటి చర్యలకు రాజకీయ పార్టీల ప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని కోరారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్, డీఆర్వో సూర్యప్రకాష్ , ఆర్డీఓ సుబ్రమణ్యం, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
టూరిస్టు గైడ్‌లుగా యువతకు అవకాశం..
పర్యాటక రంగంపై ఆసక్తి ఉన్న యువత టూరిస్ట్ గైడ్‌లుగా మారేందుకు తెలంగాణ హెరిటేజ్, పర్యాటకశాఖ అవకాశాలు కల్పిస్తోందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. బుధవారం కలెక్టర్ కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో తెలంగాణ హెరిటేజ్, పర్యాటకశాఖ రూపొందించిన టూరిస్ట్ గైడ్ పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్రంలోని చారిత్రక, సాంస్కృతిక, పర్యాటక ప్రాంతాల గురించి పర్యాటకులకు సమగ్రంగా వివరించేందుకు శిక్షణ పొందిన టూరిస్ట్ గైడ్లు అవసరమన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు తెలంగాణ వారసత్వ సంపదను ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. పర్యాటక రంగంపై ఆసక్తి ఉన్న యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.


