వనపర్తి రూరల్: కేంద్రాలకు వచ్చిన వరి ధాన్యం కొనుగోళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని, ఎక్కడా జాప్యం జరగకుండా చూడాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశించారు. బుధవారం ఆయన మండలంలోని కడుకుంట్ల కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, తాలు, చెత్త లేకుండా కేంద్రానికి తీసుకొచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. సేకరించిన ధాన్యాన్ని రైస్‌మిల్లుకు తరలించడానికి స్థానిక ట్రాక్టర్లను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, తద్వారా రవాణా ప్రక్రియ వేగవంతం అవుతుందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తిస్థాయిలో ధాన్యాన్ని సేకరించాలని.. రైతులు శ్రమించి పండించిన పంటను కొనుగోలు చేయడంలో మిల్లర్లు నిబంధనలు అతిక్రమించకూడదని, ఎక్కడైనా తరుగు పేరిట మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


