ఖిల్లాఘనపురం: పురాతన కట్టడాలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పురావస్తుశాఖ అధికారులు గౌస్, జావిద్ అన్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం మండలానికి వచ్చిన వారు గ్రామపెద్దలు, యువత, విద్యార్థులతో కలిసి ఖిల్లా గట్టును సందర్శించి గుట్టపై ఉన్న ప్రధాన ద్వారాలు, ఫిరంగి, చెరువులు, గుర్రపు గాట్లు తదితర వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజుల కాలం నాటి కోట, ఫిరంగి నేటికీ చెక్కు చెదరలేదన్నారు. గుట్టపై కాకతీయుల కాలంలో తవ్విన చెరువుల్లో నేటికీ నీళ్లు ఉన్నాయని తెలిపారు. ప్రతి ఏటా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను ఖిల్లా గట్టును చూపించాలని సూచించారు. పురాతన కట్టడాలు, నిర్మాణాలు, ఆలయాలు విద్యార్థి దశలో చూస్తే గుర్తుండిపోతాయని చెప్పారు. వారి వెంట గ్రామపెద్దలు ఆగారం ప్రకాష్, నాగేష్, యాదయ్య, దేవేందర్, ముజాహిద్, వెంకటేష్, పలువురు వార్డు సభ్యులు ఉన్నారు.
ముగిసిన ఇంటర్‌సప్లిమెంటరీ పరీక్షలు
వనపర్తిటౌన్: జిల్లాలో ఈ నెల 13న ప్రారంభమైన ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు మంగళవారం ముగిశాయి. చివరిరోజు ఉదయం జరిగిన మొదటి సంవత్సరం పరీక్షలకు 1,778 మంది విద్యార్థులకుగాను 1,621 మంది హాజరుకాగా 157 మంది గైర్హాజరయ్యారు. అదేవిధంగా మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 622 మంది విద్యార్థులకుగాను 568 మంది హాజరుకాగా.. 54 మంది రాయలేదని డీఐఈఓ నరేందర్‌కుమార్ వివరించారు.
మెడికల్ దుకాణాల బంద్‌తో ఇబ్బందులు ఉండవు
వనపర్తి: జిల్లాలో బుధవారం మెడికల్ దుకాణాల బంద్ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ రష్మిక ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజారోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని జిల్లా కెమిస్ట్, డ్రగిస్ట్ ప్రతినిధులతో సంప్రదింపు జరిపామని.. వనపర్తి, పెబ్బేరు, ఆత్మకూర్, కొత్తకోటలో కనీసం మూడు దుకాణాలు తెరిచి ఉంటాయని పేర్కొన్నారు. అదేవిధంగా జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఉన్న జీవన్‌ధారా, రెడ్‌క్రాస్ జనరిక్ మెడికల్ దుకాణం అందుబాటులో ఉంటాయని వివరించారు. మెడిప్లస్, అపోలో వంటి రిటైల్ ఫార్మసీ చైన్ ప్రతినిధులను సంప్రదించగా.. వారు కూడా బంద్ రోజున తమ సేవలు కొనసాగిస్తామని, మందుల లభ్యతలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ప్రాంతంలో కనీసం ఒక దుకాణం తెరిచేలా చూస్తామని చెప్పారని తెలిపారు. ఎక్కడైనా మెడిసిన్ అందుబాటులో లేకపోతే జిల్లా డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్‌ను సెల్‌నంబర్ 83339 25874 సంప్రదించాలని సూచించారు.


