అన్నదాతల ఆగ్రహం.. రోడ్డెక్కి ఆందోళన | - | Sakshi
Sakshi News home page

అన్నదాతల ఆగ్రహం.. రోడ్డెక్కి ఆందోళన

May 20 2026 10:25 AM | Updated on May 20 2026 10:25 AM

వనపర్తి రూరల్‌: కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 45 రోజులు గడుస్తున్నా.. నేటికీ వరి ధాన్యం కొనుగోళ్లు చేపట్టడం లేదంటూ ఆగ్రహించిన రైతులు మంగళవారం మండలంలోని రాజపేట కొనుగోలు కేంద్రం ఎదుట రహదారిపై బైఠాయించి ధాన్యానికి నిప్పంటించి రాస్తారోకో చేపట్టారు. వీరికి సర్పంచ్‌ ఎల్లయ్య, సింగిల్‌విండో చైర్మన్‌ రఘువర్ధన్‌రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. నెల రోజులుగా ధాన్యం అమ్ముకోలేక.. ఇప్పటికే విక్రయించిన ధాన్యాన్ని రైస్‌మిల్లుకు తరలించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అకాల వర్షాలకు ధాన్యం తడిస్తే తీవ్రంగా నష్టపోతా మని రైతులు తమ ఆవేదనను వెళ్లగక్కారు. ఽతూకం చేసిన ధాన్యాన్ని రైతులు ట్రాక్టర్లలో మిల్లుకు తరలిస్తే మిల్లరు దించుకోకుండా తిప్పి పంపారని అసహనం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ రమేష్‌రెడ్డి, ఎస్‌ఐ హృశికేష్‌ అక్కడికి చేరుకొని వారితో మాట్లాడారు. ఇప్పటి నుంచి సకాలంలో ధాన్యం కొనుగోలు చేస్తామని.. తరలింపునకు లారీల కొరత తలెత్తకుండా చూస్తామని, ఎ లాంటి ఆందోళనలు చెందవద్దని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించి ధర్నా విరమించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ చిన్నారెడ్డి, నాయకులు మాధవరెడ్డి, జయరాములు, సుదర్శన్‌రెడ్డి, తిరుపతయ్య, తెలుగు నారాయణ, మోహన్‌రెడ్డి, సత్యారెడ్డి, శంకర్‌రెడ్డి, మహిళా రైతులు పాల్గొన్నారు.

ధాన్యానికి నిప్పంటించి నిరసన

Advertisement
 
Advertisement
Advertisement