వనపర్తి: ఘన వ్యర్థాల నిర్వహణపై గ్రామస్థాయిలో ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. మంగళవారం ఆయన ఘన వ్యర్థాల నిర్వహణ, ఉపాధిహామీ లక్ష్యాలు తదితర అంశాలపై కలెక్టరేట్ నుంచి ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్‌న్స్ నిర్వహించారు. సుప్రీంకోర్టు ఇటీవల జారీ చేసిన ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన నాలుగు మార్గదర్శకాలను గ్రామపంచాయతీల్లో సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. వ్యర్థాలు సేకరించే పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి శాసీ్త్రయ విధానంలో చెత్త నిర్వహణ చేపట్టేలా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి మండలంలో భారీస్థాయిలో వ్యర్థాలు ఉత్పత్తి చేసే బల్క్‌వేస్ట్ జనరేటర్లను గుర్తించి వారిపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలన్నారు. అలాగే ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా గ్రామపంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఆదాయ వనరులను సృష్టించాలని కోరారు. ఫంక్షన్ హాళ్లు, ప్రజారవాణా సదుపాయాలు, హాస్టళ్లు వంటి ఆదాయాన్ని తెచ్చే ఆస్తులను గ్రామపంచాయతీలు అభివృద్ధి చేయాలని సూచించారు. ఉపాధిహామీ కూలీల సంఖ్య పెంపునకు తగిన చర్యలు చేపట్టాలని.. నిరంతర ఉపాధి కల్పించే విధంగా పనులు గుర్తించాలని సూచించారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఉపాధి పనులను ఉదయం 5.30 నుంచి 6 గంటల మధ్య ప్రారంభించేలా చూడాలని, పని ప్రదేశాల్లో కార్మికులకు తాగునీరు, నీడ తదితర మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జెడ్పీ సీఈఓ యాదయ్య, జెడ్పీ డిప్యూటీ సీఈఓ రాంమహేశ్వర్‌రెడ్డి, డీఎల్పీఓ రఘునాథ్, డీఆర్డీఓ ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.


