పంటమార్పిడితోనే అధిక దిగుబడులు | - | Sakshi
Sakshi News home page

పంటమార్పిడితోనే అధిక దిగుబడులు

May 20 2026 10:25 AM | Updated on May 20 2026 10:25 AM

వనపర్తి రూరల్‌: పంటమార్పిడితోనే అధిక దిగుబడులు పొందవచ్చని.. రైతులు ఒకే రకం పంటలు కాకుండా పంటమార్పిడి చేపట్టాలని పాలెం వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత డా. పద్మశ్రీ సూచించారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలోని చందాపూర్‌ రైతువేధికలో రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమెతో పాటు శాస్త్రవేతలు డా. ఆగ్రోనమి, శోభా రాథోడ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు ఏళ్ల తరబడి వరి మాత్రమే సాగుచేస్తున్నారని, దీంతో చీడపీడల బాధ అధికమవుతుందని చెప్పారు. కూరగాయలు, పప్పుదినుసులు, వాణిజ్య పంటలు సాగు చేయాలని సూచించారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గించి పచ్చిరొట్ట, జీవన ఎరువులు వాడాలని కోరారు. పంటను రోజు గమనించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలని, నేల పరీక్షల ఆధారంగా ఎరువులు వినియోగించడం ఉత్తమమని పేర్కొన్నారు. ఎరువులు, పురుగు మందులు సరైన మోతాదులో. సరైన సమయంలో వాడాలని.. ఇది పంటల నాణ్యతను పెంచడంతో పాటు సాగు ఖర్చు తగ్గిస్తుందని వివరించారు. ఏఈఓ శ్రీనివాసులు మాట్లాడుతూ.. భూ సారం పెంపొందించేందుకు వ్యవసాయశాఖ ద్వారా రాయితీపై జీలుగ, జనుము విత్తనాలు అందిస్తున్నామని చెప్పారు. రైతులు వాటిని సాగుచేసి పూత దశలో భూమిలో కలియదున్ని భూ సారం పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్‌ఈఓ బాలప్రకాష్‌, వినోద్‌, విండో డైరెక్టర్‌ మహేందర్‌, ఉప సర్పంచ్‌ నరేందర్‌, శ్యాంయాదవ్‌, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement