రోజుల తరబడి కేంద్రాల వద్దే పడిగాపులు
వెంటనే తరలించాలి..
ఐదెకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తే 106 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే గన్నీబ్యాగులు లేవని చెబితే బయట ప్రైవేట్‌గా కొనుగోలు చేశాం. తూకం పూర్తయినా నేటికీ తరలించడం లేదు. 20 రోజులుగా లారీలు రావడం లేదు. కేంద్రంలో కొనుగోలు చేసిన ధాన్యం కుప్పలు 100కు పైగా ఉన్నాయి. వర్షం వస్తే మేమేం కావాలి. వెంటనే తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి.
– రాములు, రైతు, పొలికెపాడు, గోపాల్‌పేట
గన్నీ బ్యాగుల కొరతతో ఇబ్బందులు..
మొక్కజొన్న విక్రయానికి చాలా ఇబ్బందులు పడ్డాం. ఎప్పుడూ లేని విధంగా గన్నీ బ్యాగుల కొరత తలెత్తడంతో ప్రైవేట్‌లో రూ.30కి సంచి చొప్పున కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పంట విక్రయ సమయంలో అదృష్టవశాత్తు అకాల వర్షాలు కురవకపోవడంతో బయటపడ్డాం.
– రమేష్, చిన్నంబావి
డబ్బులు జమ చేస్తున్నాం..
గన్నీబ్యాగుల కొరత ఉన్నమాట వాస్తవమే. కానీ రైతులు ప్రైవేట్‌గా కొనుగోలు చేసి తీసుకొస్తే తూకాలు చేస్తున్నాం. ఇందుకు సంబంధించిన డబ్బులను వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నాం. ఇప్పటి వరకు 50 శాతానికి పైగా కొనుగోళ్లు పూర్తి చేశాం. చెల్లింపులు కూడా వెంటనే పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. కేంద్రాలకు తీసుకొచ్చిన పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తాం. రైతులు అధైర్యపడొద్దు.
– చంద్రమౌళి, మార్క్‌ఫెడ్ అధికారి, వనపర్తి
వనపర్తి: మొక్కజొన్న విక్రయానికి జిల్లా రైతులకు అవస్థలు తప్పడం లేదు. జిల్లాలోని గోపాల్‌పేట, రేవల్లి, ఏదుల, చిన్నంబావి, వనపర్తి, ఖిల్లాఘనపురం మండలాల్లో సాగు సుమారు 14 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి రావచ్చని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. దీని ప్రకారం మార్క్‌ఫెడ్ అధికారులు ధాన్యం కొనుగోళ్లకుగాను జిల్లావ్యాప్తంగా వనపర్తి, గోపాల్‌పేట, రేవల్లి, ఏదుట, వీపనగండ్ల, పెబ్బేరులో కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరణ బాధ్యతను పీఏసీఎస్‌లకు అప్పగించారు. కాగా అటు వరి, ఇటు మొక్కజొన్న కొనుగోళ్లు చేపట్టలేక పీఏసీఎస్ సిబ్బంది సతమతమవుతుండగా.. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొంది.
తప్పని ఆర్థిక భారం..
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో పాటు పంట ఉత్పత్తులు తడిసిపోకుండా టార్పాలిన్లు, ఎలక్ట్రానిక్ కాంటాలు, కావాల్సిన మేర గన్నీబ్యాగులు, తూకం చేసిన ధాన్యం బస్తాలను తరలించేందుకు సరిపడా లారీలు, నిల్వలకు గోదాంలను సమకూర్చాల్సి ఉంది. కాగా మార్క్‌ఫెడ్ అధికారులు సరైన దృష్టి సారించకపోవడంతో తూకం చేసిన మొక్కజొన్న బస్తాలు కేంద్రాల్లోనే నిల్వ ఉండటం.. రాశులుగా పోసి పంట ఉత్పత్తులు నింపేందుకు సరిపడా గన్నీబ్యాగులు లేకపోవడం వంటి సమస్యలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదేమిటని నిర్వాహకులను ప్రశ్నిస్తే గన్నీబ్యాగులు తీసుకొస్తే తూకం చేస్తామంటూ నిర్లక్ష్యంగా సమాధానాలు ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చేసేది లేక కొందరు రైతులు ప్రైవేట్‌గా గన్నీబ్యాగులు కొనుగోలు తీసుకొస్తే తూకం చేసి అక్కడే నిల్వ చేసి వదిలేస్తున్నారు. ఈ విషయమై కమ్యూనిటీ పార్టీల నాయకులు సైతం నిరసన కార్యక్రమాలు చేపట్టినా అధికారుల్లో చలనం కనిపించడం లేదు.
లారీలు, గన్నీబ్యాకుల కొరతే ప్రధాన కారణం
తూకాలు చేసినా.. తరలని వైనం
ధాన్యం తడుస్తుందని అన్నదాతల ఆందోళన
వనపర్తిలో భారీగా నిల్వలు..
వనపర్తి మార్కెట్‌యార్డులోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి వనపర్తి, గోపాల్‌పేట, ఖిల్లాఘనపురం తదితర ప్రాంతాల రైతులు పెద్దఎత్తున పంట ఉత్పత్తులు విక్రయానికి తీసుకొస్తున్నారు. 20 రోజులుగా కొనుగోళ్లు కొనసాగకపోవడంతో రైతు లు మార్కెట్‌లోనే పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొంది. కొనుగోలు చేసిన ఉత్పత్తులు అధికారు లు కేటాయించిన నిర్దేశిత గోదాంలకు చేరితేనే రై తుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతా యి. కేంద్రాల్లోనే ధాన్యం బస్తాలు నిల్వ ఉండడంతో విక్రయించి రోజులు గడుస్తున్నా.. డ బ్బులు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


