క్రీడలకు ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

క్రీడలకు ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం

May 19 2026 12:22 AM | Updated on May 19 2026 12:22 AM

వనపర్తి: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యమిస్తూ క్రీడాభివృద్ధే ధ్యేయంగా పని చేస్తోందని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి తెలిపారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న యువజన, క్రీడా వారోత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లాకేంద్రంలో జిల్లా యువజన, క్రీడల అధికారి సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో 2కే రన్‌ నిర్వహించగా.. ముఖ్యఅతిథులుగా కలెక్టర్‌తో పాటు అదనపు ఎస్పీ రాజేష్‌ మీనా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల మైదానం నుంచి బస్‌డిపో మీదుగా ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల మైదానం వరకు రన్‌న సాగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి జీవితంలో క్రీడలు భాగం కావాలని కోరారు. శారీరకంగా ఆరోగ్యంగా ఉంటేనే మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటామని.. అందరూ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవాలని సూచించారు. అనంతరం బాక్సింగ్‌ స్పోర్ట్స్‌ క్యాంప్‌ను ప్రారంభించారు. యువత క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు.

అదనపు ఎస్పీ రాజేష్‌ మీనా మాట్లాడుతూ.. క్రీడలను అలవాటు చేసుకోవడంతో శారీరకంగా దృఢంగా ఉండటం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఫిట్‌నెస్‌ కలిగి ఉండాలని.. తద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకోగలమన్నారు. కార్యక్రమంలో భాగంగా యూత్‌, స్పోర్ట్స్‌ వీక్‌, టూరిజానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. వారోత్సవాల్లో ప్రతిరోజు ఒక కార్యక్రమం నిర్వహిస్తామని జిల్లా యువజన క్రీడల అధికారి తెలిపారు. యువతలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌, యూత్‌ పార్లమెంట్‌, స్వచ్ఛదనం.. పచ్చదనం, వివిధ రంగాల్లో రాణిస్తున్న యువతకు సన్మానం తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ బాలాజీనాయక్‌, అధికారులు, క్రీడాకారులు, విద్యార్థులు, యువత పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement