కొత్తకోట రూరల్: పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. సోమవారం కొత్తకోటలోని పీఏసీఎస్ కార్యాలయంలో కొత్తకోట, పామాపురం గ్రామాల వరి కొనుగోళ్లకు సంబంధించి అధికారులతో సమావేశమై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్‌తో మాట్లాడి వెంటనే ధాన్యాన్ని మిల్లులు, గోదాములకు తరలించాలని సూచించారు. మిల్లర్లు ఆలస్యం చేయకుండా త్వరగా ధాన్యాన్ని దించుకోవాలని సూచించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రైతులు ధైర్యంగా ఉండాలన్నారు. అంతకుముందు పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహ ప్రవేశాల్లో పాల్గొన్నారు. అక్కడి నుంచి అసంపూర్తిగా ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌యార్డును, కొత్త మున్సిపల్ భవనం నిర్మాణానికి సంబంధించిన నమూనాను పరిశీలించారు. పుర చైర్‌పర్సన్ పి.అరుణ, వైస్ చైర్‌పర్సన్ పి.పల్లవి, మార్కెట్‌యార్డ్ చైర్మన్ పి ప్రశాంత్, మాజీ సర్పంచ్ శేఖర్‌రెడ్డి, రావుల కరుణాకర్‌రెడ్డి, పీఏసీఎస్ సీఈఓ బాలరాజు, పామాపురం సీఈఓ రాఘవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
కాజ్‌వే నిర్మాణానికి భూమిపూజ..
మదనాపురం: మండలంలోని దంతనూరు – శంకరంపేట మధ్యలో ఉన్న వాగుపై కాజ్‌వే నిర్మాణానికి ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి సోమవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షాకాలంలో ఆయా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచి ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని.. సమస్యను పరిష్కరించేందుకు కాజ్‌వే నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. నాణ్యత ప్రమాణాలతో నిర్దేశిత కాలపరిమితిలోగా పనులు పూర్తి చేయాలని కోరారు. సర్పంచులు నాగరాజుగౌడ్, శ్రీనివాసులు, తహసీల్దార్ రేపోలు రాజు, ఎంపీడీఓ ప్రసన్నకుమారి, సుక్క మహేష్ తదితరులు పాల్గొన్నారు.


