వనపర్తి: ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్న యువజన క్రీడలు, టూరిజం వారోత్సవాలను లైన్ డిపార్ట్‌మెంట్, మండలస్థాయి అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 18వ తేదీన ఫిట్ అండ్ యాక్టివ్ తెలంగాణ కార్యక్రమం సందర్భంగా ఉదయం 6.30 గంటలకు ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానం నుంచి బస్‌డిపో మీదుగా పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు 2కే రన్, యువ టూరిజం క్లబ్‌లను జాగృతం చేసే గోడపత్రిక ఆవిష్కరణ ఉంటుందన్నారు. రెండోరోజు కెరీర్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్, చారిత్రాత్మక పురాతన కట్టడాలపై అవగాహన.. మూడోరోజు యూత్ లీడర్‌షిప్ సమ్మిట్, పర్యాటకానికి సంబంధించి హెరిటేజ్ వాక్, లోకల్ గైడ్ వలంటీర్ల రిజిస్ట్రేషన్ జరుగుతుందని చెప్పారు. అలాగే నాలుగోరోజు స్పోర్ట్స్‌డే సందర్భంగా పెబ్బేరులో ఫుట్‌బాల్ క్రీడ, ఐదోరోజు యూత్ ఫర్ క్లీన్ తెలంగాణ, పర్యాటక ప్రాంతాల్లో స్వచ్ఛదనం.. ఆరోరోజు ఉద్యోగ సాధన, టూరిజం బ్రాండ్ కిట్ విడుదల కార్యక్రమాలు కొనసాగుతాయని వివరించారు. ఆయా కార్యక్రమాలను రోజువారీగా జిల్లాకేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో నిర్వహించి విజయవంతం చేయాలని ఆదేశించారు. డీవైఎస్‌ఓ సుధీర్‌కుమార్‌రెడ్డి, జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ, పరిశ్రమల అధికారి జ్యోతి పాల్గొన్నారు.
కళా నైపుణ్యాలు పెంపొందించుకోవాలి..
వనపర్తిటౌన్: విద్యార్థులు చదువుతో పాటు కళా నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ప్రయత్నించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ కోరారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా శనివారం కలెక్టరేట్‌లో జెడ్పీహెచ్‌ఎస్ మద్దిగట్ల, మోజర్ల విద్యార్థులు బంజారా, తెలంగాణ బోనాల నృత్యాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. విద్యార్థులు కళా నృత్యాలను నేర్చుకొని నాటి కళలను, చరిత్రను బతికించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం విద్యార్థులను డీఈఓ అబ్ధుల్ ఘనీ అభినందించారు. జీసీడీఓ ఇందిర, పెద్దమందడి మండల విద్యాధికారి మంజులత, ప్రధానోపాధ్యాయుడు ఎస్.వరప్రసాదరావు, జిల్లా కో–ఆర్డినేటర్లు శేఖర్, మహానంది, నారాయణమ్మ, ప్రతాప్‌రెడి పాల్గొన్నారు.


