కొత్తకోట రూరల్: వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ మరింత వేగంగా కొనసాగించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియపై గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఏయే మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఎంతెంత ధాన్యం తూకం చేసి మిల్లులకు తరలించేందుకు సిద్ధంగా ఉంది.. ఈ రోజు ఎంత ధాన్యం కేంద్రాలకు వచ్చింది.. తూకం చేసి బస్తాల్లో నింపిన ధాన్యం ఎన్ని క్వింటాళ్లు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. గురువారం 382 కొనుగోలు కేంద్రాల్లో 6,569 మెట్రిక్ టన్నుల ధాన్యం తూకం చేసినట్లు పౌరసరఫరాలశాఖ అధికారి వివరించారు. 195 లారీల ధాన్యం ఆయా మిల్లుల వద్ద దించినట్లు లెక్కలు చూపించారు. ఇప్పటి వరకు 69,428 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. స్పందించిన కలెక్టర్ పెద్దమందడి, కొత్తకోట, మదనాపురం, పాన్‌గల్ ఐకేపీ కేంద్రాల్లో తూకం చేసి బస్తాల్లో నింపిన ధాన్యం నిల్వలు అధికంగా ఉన్నాయని, అదేవిధంగా పీఏసీఎస్‌కు సంబంధించి కొత్తకోట, ఆత్మకూర్, ఖిల్లాఘనపురం, పెద్దమందడి, వనపర్తి, గోపాల్‌పేట మండలాల్లో నిల్వలు అధికంగా ఉన్నందున శుక్రవారం ఆయా మండలాలకు అత్యధికంగా లారీలు పంపించాల్సిందిగా పౌరసరఫరాలసంస్థ డీఎం ఆంజనేయులు ట్రాన్స్‌పోర్ట్ అధికారులను ఆదేశించారు. హమాలీల కొరత రాకుండా చూడాలని మార్కెటింగ్ అధికారిని ఆదేశించారు. రోజు సమీక్ష ఉంటుందని, కొనుగోళ్లలో మరింత వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీ విశ్వనాథ్, డీఆర్డీఓ ఉమాదేవి, కో–ఆపరేటివ్ అధికారి బి.రాణి, డీటీఓ మానస, మార్కెటింగ్ అధికారి స్వరణ్‌సింగ్, జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


