ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

May 15 2026 10:02 AM | Updated on May 15 2026 10:02 AM

వనపర్తి రూరల్‌: ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్‌కు దీటుగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. ఏబీడీ లిక్కర్‌ కంపెనీ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్‌) కింద రూ.49 లక్షలతో పెబ్బేరు, శ్రీరంగాపురం మండలాల్లోని 13 అంగన్‌వాడీలను ఆధునికీకరించి ఆదర్శ కేంద్రాలుగా తీర్చిదిద్దారు. పెబ్బేరులోని 2, 5, మండలంలోని కంచిరావుపల్లి మోడల్‌ అంగన్‌వాడీ కేంద్రాలను గురువారం రాష్ట్ర శాట్‌ చైర్మన్‌ శివసేనారెడ్డి, కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో తెలంగాణాను విద్యారంగంలో నంబర్‌–1గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అల్పాహార పథకం త్వరలోనే అమలు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తున్నామని.. తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించాలని సూచించారు. అలాగే సీఎస్‌ఆర్‌ నిధులు 2 శాతం పెంచి ఉమ్మడి పెబ్బేరు మండలంలోని పాఠశాలల అభివృద్ధికి సహకరించాలని, పాఠశాలలకు ప్రహరీలు, రవాణా సౌకర్యాలను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోవాలని ఏబీడీ కంపెనీ ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి మాట్లాడుతూ.. ఏబీడీ లిక్కర్‌ కంపెనీ సహకారంతో పెబ్బేరు, శ్రీరంగాపురం మండలాల్లోని 13 అంగన్‌వాడీ కేంద్రాలను ఆదర్శంగా తీర్చిదిద్దడం అభినందనీయమని కొనియాడారు. ఈ సౌకర్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, మున్సిపల్‌ చైర్మన్‌ అక్కి శ్రీనివాస్‌గౌడ్‌, సర్పంచ్‌, వైస్‌ చైర్మన్‌ సుమిత్ర, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ విజయవర్ధన్‌రెడ్డి, ఏబీడీ కంపెనీ ప్రతినిధులు రాజేష్‌, ఉమాశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement