ఉపాధికి ఊతం | - | Sakshi
Sakshi News home page

ఉపాధికి ఊతం

May 14 2026 12:13 AM | Updated on May 14 2026 12:13 AM

వేసవిలో కూలీల సంఖ్య పెంపే లక్ష్యం

గ్రామాల బాట పట్టిన అధికారులు

జాబ్‌కార్డు ఉన్న కూలీలందరూపాల్గొనేలా అవగాహన

గతేడాది 16 వేల మందికి.. ఈ ఏడాది రెట్టింపు యోచనతో ముందుకు...

జూన్‌ 1 నుంచి ప్రారంభం కానున్న వీబీ జీ రాంజీ పథకం

అవగాహన కల్పిస్తున్నాం..

రోజు గ్రామాలకు వెళ్లి ఉపాధి పనుల అవశ్యకతను కూలీలకు వివరిస్తున్నాం. ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని.. జీవనభృతితో పాటు గ్రామాభివృద్ధికి సైతం ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరవుతాయనే విషయాలను వివరిస్తున్నాం. ఈ నెలాఖరు వరకు జాతీయ ఉపాధిహమీ పథకం ఉంటుందని.. జూన్‌ 1 నుంచి వీబీ జీ రాంజీ కొత్త పథకం అమలులోకి వస్తుందని, జాబ్‌కార్డులు ఉన్న కూలీలు పనులు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నాం.

– శ్రీనివాసులు, ఎంపీడీఓ, అమరచింత

కూలీల పెంపునకు స్పెషల్‌ డ్రైవ్‌..

జాతీయ ఉపాధిహమీ పథకం ద్వారా జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వేసవిలో పనులు కల్పించడానికి ప్రభుత్వ ఆదేశాలతో మే నెలలో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నాం. కొత్త పథకంలో ఎలాంటి నిబంధనలు ఉంటాయో తెలియదు. గ్రామాలకు మంజూరైన ఉపాధి పనులను కూలీలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. ఈ ఏడాది 33 వేల మంది కూలీలకు ఉపాధి కల్పించాలనేది ప్రణాళిక. – ఉమాదేవి, డీఆర్డీఓ

అమరచింత: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా వేసవిలో గ్రామాల్లోని అధికమంది కూలీలకు పని కల్పించి ఆదుకోవాలనే లక్ష్యంతో అధికారులు ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. మండల ప్రత్యేక అధికారులతో పాటు ఎంపీడీఓలు గ్రామపంచాయతీ కార్యదర్శులు, ఉపాధి సిబ్బందితో కలిసి రోజు గ్రామాల బాట పట్టారు. తమ వద్ద ఉన్న ఉపాధి కూలీల వివరాలను చేతబట్టుకొని ఇల్లిల్లూ తిరిగి పనుల్లో పాల్గొనాలంటూ అవగాహన కల్పిస్తున్నారు. దీంతో కొంతకాలంగా పనులకు దూరంగా ఉంటున్న కూలీలందరూ తిరిగి పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. రెండేళ్ల కిందట జిల్లావ్యాప్తంగా 15 వేల నుంచి 16 వేల మంది కూలీలు ఉపాధిహామీ పనుల్లో పాల్గొంటే.. ఈసారి ఆ సంఖ్యను రెట్టింపు చేయాలనే లక్ష్యంతో అధికారుల గ్రామ పర్యటనలు కొనసాగుతున్నాయి. కూలీలు గ్రామాల్లో చెరువు పూడికతీత, రహదారులకు ఇరువైపులా ముళ్లపొదల తొలగింపు, మొక్కల సంరక్షణ, నర్సరీల నిర్వహణతో పాటు పలు రకాల పనులు చేపడుతూ ఉపాధి పొందుతున్నారు. ఈసారి జిల్లావ్యాప్తంగా 33 వేల మందికి ఉపాధిహమీ పథకం ద్వారా పని కల్పించి రికార్డు సాధించాలనే సంకల్పంతో అధికారులు ముందుకు సాగుతున్నారు.

నీటి సంరక్షణకు ప్రాధాన్యం..

గ్రామాల్లో నీటి సంరక్షణ పనులకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. గ్రామాల్లోని చెరువులు, కుంటల్లో పేరుకుపోయిన మట్టిని తొలగించి వర్షాకాలంలో వర్షపు నీరు వృథా కాకుండా నింపడంతో భూగర్భ జలాలు పెంపొందుతాయని అధికారులు వెల్లడిస్తున్నారు. వర్షపు నీటితో గ్రామాల్లోని చెరువులు కళకళలాడే విధంగా పూడికతీత పనులు చేపడుతున్నారు. అదేవిధంగా వ్యవసాయ పొలాల్లోని బావుల్లో సైతం పూడికతీత చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

ఇంకుడు గుంతల నిర్మాణం..

గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలు, ఇళ్లలో ఇంకుడు గుంతల తవ్వకానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. వ్యక్తిగత ఇంకుడు గుంతలతో పాటు చేతి పంపులు, నీటి ట్యాంకుల వద్ద నీరు వృథాగా రహదారులపై పారకుండా వాటిని నిలువరించేందుకు ఇంకుడు గుంతలను తవ్విస్తూ కూలీలకు ఉపాధి చూపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement