వనపర్తిటౌన్: వేసవి సెలవులు, వీకెండ్స్ సందర్భంగా స్థానిక ఆర్టీసీ డిపో నుంచి అరుణాచలం, గోవాకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు డిపో మేనేజర్ దేవేందర్‌గౌడ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22న శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు గోవా బస్సు బయలుదేరుతుందని, ఒక్కొక్కరికి రూ.3,600 చార్జీ ఉంటుందని పేర్కొన్నారు. అదేవిధంగా 31వ తేదీ పౌర్ణమి సందర్భంగా అరుణాచల గిరి ప్రదక్షిణకు 29వ తేదీ శుక్రవారం ప్రత్యేక బస్సు అందుబాటులో ఉంటుందన్నారు. కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శన అనంతరం అరుణాచల గిరి ప్రదక్షిణ ఆదివారం ముగించుకొని సోమవారం ఉదయం వనపర్తి చేరుకుంటుందన్నారు. ప్రయాణానికి ఒక్కొక్కరికి రూ.3,600 చార్జి ఉంటుందని వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు, భక్తులు సద్వినియోగం చేసుకోవాలని.. పూర్తి వివరాలకు సెల్‌నంబర్లు 73828 29379, 79957 01851 సంప్రదించాలని సూచించారు.
ఇంటర్ సప్లిమెంటరీపరీక్షలు ప్రారంభం
వనపర్తిటౌన్: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం పరీక్షలు నిర్వహించారు. ఫస్ట్ ఇయర్ పరీక్షలకు జనరల్ 976 మంది విద్యార్థులకుగాను 912 మంది, ఒకేషనల్ విద్యార్థులు 89 మందికిగాను 81 మంది హాజరయ్యారు. 72 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అలాగే ద్వితీయ సంవత్సరం పరీక్షలకు జనరల్ 224 మంది విద్యార్థులకుగాను 205, ఒకేషనల్ విద్యార్థులు 22 మందికిగాను 17 మంది హాజరుకాగా.. 24 మంది రాయలేదు. సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశాయి.
నిలకడగా ఉల్లి ధరలు
దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం జరిగిన వేలంలో ఉల్లి ధరలు నిలకడగా ఉన్నాయి. కొన్ని వారాలుగా రూ.వెయ్యి దాటని ఉల్లి ధర గత వారం కొంతమేర పెరిగింది. ఉదయం మార్కెట్‌లో స్థానిక వ్యాపారులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు వేలంలో పాల్గొన్నారు. క్వింటా ఉల్లి గరిష్టంగా రూ.1,500, కనిష్టంగా రూ.వెయ్యి వరకు పలికింది. 50 కిలోల బస్తాను గరిష్టంగా రూ.750, కనిష్టంగా రూ.500 వరకు విక్రయించారు. ఉల్లి నాణ్యతగా ఉండడంతో వినియోగదారులు పెద్దఎత్తున ఉల్లిని కొనుగోలు చేశారు.
కొనసాగిన అమ్మకాలు..
మార్కెట్ బయట రైతులు యథావిధిగా ఉల్లి అమ్మకాలు సాగించారు. ధరలు పెరగడంతో రైతులు రూ.600 నుంచి రూ.650 వరకు 50 కిలోల బస్తాను విక్రయించారు. చాలామంది రైతులు ట్రాక్టర్లపై ఉల్లి బస్తాలు తెచ్చి సాయంత్రం వరకు అమ్మకాలు సాగించారు. ఎక్కువగా వినియోగదారులు ఉల్లి బస్తాలను కొనుగోలు చేశారు.
బాదేపల్లి యార్డుకు
పోటెత్తిన ధాన్యం
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు బుధవారం వివిధ ప్రాంతాల నుంచి భారీగా ధాన్యం విక్రయానికి వచ్చింది. 15,674 బస్తాల ధాన్యం, 8,433 బస్తాల మొక్కజొన్న యార్డుకు రావడంతో ఆవరణంతా కిక్కిరిసిపోయింది. కాగా ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్ రకం క్వింటా గరిష్టంగా రూ.2,539, కనిష్టంగా రూ.1,601 ధరలు లభించాయి. అలాగే వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.7,642, కనిష్టంగా రూ.5,329, ఆముదాలు గరిష్టంగా రూ.6,239, కనిష్టంగా రూ.6,206, పొద్దుతిరుగుడు రూ.6,210, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,872, కనిష్టంగా రూ.1,601, జొన్నలు రూ.5,789, మినుములు రూ.6,600 చొప్పున వచ్చాయి.


