అమరచింత: జాతీయ ఉపాధిహమీ పథకం పనులు పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 10 వరకు గడువు పొడిగించిందని.. ప్రజాప్రతినిధులు త్వరగా పూర్తిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీ డీకే అరుణ కోరారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఎస్సెంటియా అడ్వాన్సుడ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.56 లక్షలతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఆమె భూమిపూజ చేసి అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకాన్ని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వీబీజీ రాంజీ పథకంగా మార్చి కూలీలకు పని దినాల పెంపుతో పాటు గ్రామాలకు అదనంగా నిధులు మంజూరు చేసేలా రూపొందించిందన్నారు. మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన ఉపాధి పనులు నేటికీ అసంపూర్తిగా ఉండటంతో నిధులు వెనక్కి వెళ్తాయని భావించి కేంద్ర గ్రామీణ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రిని కలిసి గడువు పొడిగించాలని కోరామని చెప్పారు. ఏప్రిల్ 10 వరకు గడువు పొడిగిస్తూ కేంద్ర మంత్రి నుంచి ఆదేశాలు అందాయని చెప్పారు. సమాజంలో మనుగడ సాగించాలంటే చదువుతోనే సాధ్యమని.. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించినప్పుడే సంపూర్ణ అక్షరాస్యత సాధ్యమవుతుందని తెలిపారు. పట్టణానికి చెందిన పంజాబ్, చత్తీస్‌ఘడ్ బీజేపీ సంఘటన ఇన్‌చార్జ మంత్రి శ్రీనివాస్ అదనపు తరగతి గదుల నిర్మాణానికి అభయ ఫౌండేషన్ ద్వారా నిధులు మంజూరు చేయించడం అభినందనీయమన్నారు.
జూనియర్ కళాశాల ఏర్పాటుకు కృషి..
అమరచింతలో జూనియర్ కళాశాల లేకపోవడం బాధాకరమని.. త్వరలో ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని ఎంపీ డీకే అరుణ హామీ ఇచ్చారు. అదేవిధంగా ఎస్‌బీఐ ఏర్పాటుకు ప్రయత్నిస్తానని చెప్పారు. కార్యక్రమంలో మాజీ అడ్వొకేట్ జనరల్ దేశాయి ప్రకాష్‌రెడ్డి, అభయ ఫౌండేషన్ చైర్మన్ బాలచందర్, దేవకి వాసుదేవరావు, మహంకాళి శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయురాలు శారదమ్మ, కౌన్సిలర్లు మేర్వ రాజు, ఊషన్న, విష్ణు, తిరుమల్లేష్, మీనుగ లక్ష్మి, జిందె శ్రీనివాస్, చంద్రానాయక్‌తండా సర్పంచ్ కృష్ణానాయక్, బీజేపీ పట్టణ అధ్యక్షురాలు మంగ లావణ్య, మరాఠి అశోక్, క్యామ భాస్కర్, దుబాయి వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


