వనపర్తి: దివ్యాంగులకు యూనిక్ డిజబుల్ ఐడి కార్డులను పారదర్శకంగా జారీ చేయనున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ తెలిపారు. శనివారం సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, డీఆర్డీఓలతో యూనిక్ డిజబుల్ ఐడీ కార్డుల జారీపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరం నుంచి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, డీఆర్డీఓ ఉమాదేవి పాల్గొని జిల్లా వివరాలు వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుడు ధ్రువపత్రాలు జారీ చేయమని.. అర్హులందరికి అందేలా చూస్తామని చెప్పారు. అలాగే శిబిరాలకు వచ్చే దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన సౌకర్యాలు కల్పిస్తామని వివరించారు. యూడీఐడీ దరఖాస్తులు పెండింగ్ లేకుండా వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


