వనపర్తిటౌన్: జాతీయ లోక్ అదాలత్‌లో రాజీపడి కేసులు పరిష్కరించుకుంటే కక్షిదారులు ఇరువురు గెలిచినట్లేనని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో ఆమె పాల్గొని మాట్లాడారు. రాజీ పడదగిన కేసులు లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చని సూచించారు. రాజీయే రాజ మార్గమని.. కేసులు పరిష్కరించుకుంటే ఇరువర్గాలకు లాభం చేకూరుతుందన్నారు. ప్రతి మూడు నెలలకు ఓసారి జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తామని.. అన్నదమ్ముల తగాదాలు, భార్యాభర్తల గొడవలు, చెక్ బౌన్స్, ఇన్స్యూరెన్స్, సైబర్ క్రైమ్, డ్రంకెన్ డ్రైవ్ తదిత కేసులు పరిష్కరించుకోవచ్చని వెల్లడించారు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగకుండా రెండు వర్గాలు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకునే అవకాశం లోక్ అదాలత్ కల్పిస్తుందని.. దీంతో డబ్బు, సమయం ఆదా అవుతుందని చెప్పారు. శనివారం జరిగిన లోక్ అదాలత్‌లో జిల్లాలోని వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న 5,625 కేసులు పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని, సీనియర్ సివిల్ న్యాయమూర్తి జి.కళార్చన, అడిషనల్ సీనియర్ సివిల్ న్యాయమూర్తి కె.కవిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి టి.కార్తీక్‌రెడ్డి, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి బి.శ్రీలత, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి ఎన్.అశ్విని, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్‌కుమార్, కార్యదర్శి వెంకటరమణ, న్యాయవాదులు, బ్యాంకు మేనేజర్, కోర్టు సిబ్బంది, లోక్‌అదాలత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


