● అంకెల గారడీతో
మభ్యపెట్టే ప్రయత్నం
● మాజీ మంత్రి
సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
వనపర్తి: కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పేర్కొన్న పద్దులు రాష్ట్ర ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసేలా ఉన్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని తన నివాసంలో స్థానిక పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రూ.3 లక్షల కోట్లు అప్పు చేసి మూడు సంక్షేమ పథకాలు అమలు చేయలేని దుస్థితిలో రేవంత్‌రెడ్డి సర్కారు కొనసాగుతుందని విమర్శించారు. ఆరు గ్యారంటీలు, 11 డిక్లరేషన్లు పూర్తిగా మోసపూరితమేనని.. దేశ చరిత్రలో ప్రజలను ఇంతగా మోసం చేసే బడ్జెట్ చూడలేదన్నారు. అధికారం కోసం ఎన్నికల సమయంలో డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ నాయకులు ప్రజలకు ఇచ్చిన హామీల్లో కనీసం కొన్నింటిని కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. దివ్యాంగులు, విద్యార్థినులు, రైతులు, కార్మికులు, ఉపాధి కూలీలు, హరిజన, గిరిజన, బడుగు బలహీన, మైనార్టీ వర్గాలను మోసం చేసి చరిత్రకెక్కిన ఘనత కాంగ్రెస్‌కే దక్కిందన్నారు.


