సరళాసాగర్.. రికార్డు
ఒకే ఏడాది ఏడుసార్లు తెరుచుకున్న సైఫన్లు
● ప్రాజెక్టు చరిత్రలో 2025 ఓ మైలురాయి
● ఆరు దశాబ్దాల్లో
తొలిసారి అంటున్న స్థానికులు
సరళాసాగర్ జలాశయం
వనపర్తి: సంస్థానాధీశుల కాలంలో అమెరికాలోని కాలిఫోర్నియా టెక్నాలజీని వినియోగించి ఆటోమెటిక్ సైఫన్ సిస్టంతో నిర్మించిన సరళాసాగర్ ప్రాజెక్టు 2025 సంవత్సరంలో ఓ చరిత్ర సృష్టించిందని స్థానికులు, ఇంజినీర్లు భావిస్తున్నారు. వనపర్తి సంస్థానాన్ని పాలించిన రాణి సరళాదేవి జ్ఞాపకార్థం రాజారామేశ్వరరావు 1949లో సరళాసాగర్ ప్రాజెక్టు పనులు ప్రారంభించి 1959లో పూర్తిచేసి ప్రారంభించిన విషయం పాఠకులకు విధితమే. ప్రాజెక్టు చరిత్రలో 2025 సంవత్సరం ఒకే వర్షాకాలంలో ఏడు పర్యాయాలు ఆటోమెటిక్ సైఫన్లు తెరుచుకొని దిగువకు నీరు ప్రవహించడం రికార్డు బ్రేక్‌గా చెప్పవచ్చు. ఈ ఏడాది వర్షాలు భారీగా కురవడంతో ఊకచెట్టువాగు పొంగి ఆగస్టులో ఒకసారి, సెప్టెంబర్ మూడుసార్లు, అక్టోబర్ 24వ తేదీ వరకు మూడుసార్లు మొత్తంగా ఏడుసార్లు సైఫన్లు తెరుచుకొని దిగువకు వరద పారినట్లు ఇంజినీర్ ప్రమోద్ అధికారికంగా వెల్లడించారు.
● ప్రాజెక్టులో నీటిమట్టం పెరిగిన సమయంలో మానవ రహితంగా గేట్లు తెరుచుకునే విధంగా ఆసియాలోనే ప్రథమంగా వనపర్తి సంస్థానాధీశులు తమ సంస్థానంలో నిర్మాణం చేయించారు. నిర్దేశిత స్థాయి మించి నీరు ప్రాజెక్టులోకి చేరిన వెంటనే ఆటోమెటిక్‌గా ప్రైమరీ, ఉడెన్ సైఫన్లు తెరుచుకొని దిగువకు నీరు పారడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. దశాబ్దాల కాలం పాటు తెరుచుకొని ఈ ప్రాజెక్టు సైఫన్లు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత పాలకులు ఈ ప్రాజెక్టుకు నీటి పాటుతో పాటు కేఎల్‌ఐ కాల్వతో అనుసంధానం చేయడంతో జలకళను సంతరించుకుంది. 2014 వరకు పదేళ్లకు ఓసారి తెరుచుకొనే సైఫన్లు ఇటీవల భారీ వర్షాలకు తరుచుగా తెరుచుకుంటున్నాయి. ఈ ప్రాజెక్టును పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణరావు, మంత్రుల బృందం ప్రాజెక్టుని సందర్శించి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి సిఫారస్ చేశారు.
● ఆగస్టు 13 నుంచి 31వ తేదీ వరకు 18 రోజుల పాటు సైఫన్లు తెరుచుకుని గరిష్టంగా 14,760 క్యూసెక్కులు, కనిష్టంగా500 క్యూసెక్కులు
దిగువకు నీరు పారింది.
● సెప్టెంబర్ 1 నుంచి ఏడో తేది వరకు, తిరిగి 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు, 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు గరిష్టంగా 11,320, కనిష్టంగా 500 క్యూసెక్కులు దిగువకు పారింది.
● అక్టోబర్ 10 నుంచి 16వ తేదీ వరకు, 24, 25వ తేదీల్లో గరిష్టంగా 7,380 క్యూసెక్కులు, కనిష్టంగా 500 క్యూసెక్కులుప్రాజెక్టు నుంచి దిగువకు నీరు పారింది.
సరళాసాగర్.. రికార్డు


