‘చేనేత’ సమస్యల పరిష్కారానికేమహాధర్నా
కొత్తకోట: చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 20న కమిషనర్ కార్యాలయం ఎదుట మహాధర్నా చేపడతామని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పొబ్బతి రవికుమార్ పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని వీవర్స్‌కాలనీలో జరిగిన చేనేత కార్మికుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేత కార్మికుల రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించి ఏడాదిన్నర కావస్తున్నా.. నేటికీ అమలు కాలేదన్నారు. 15 రోజుల్లో రుణమాఫీ నిధులు కార్మికుల ఖాతాల్లో జమ చేయకపోతే హైదరాబాద్ నాంపల్లిలోని హ్యాండ్‌లూమ్ టెక్స్‌టైల్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. గతంలో ఉన్న చేనేత చేయూత నగదు బదిలీ పథకం స్థానంలో చేనేత భరోసా పథకాన్ని నెలలు గడుస్తున్నా అమలు చేయడం లేదని ఆరోపించారు. నేతన్న బీమా పథకాన్ని వయస్సుతో నిమిత్తం లేకుండా ఇవ్వాలని నిర్ణయించడం సంతోషమేగాని.. మరణించిన నేత కార్మికులకు ఏడాది గడిచినా బీమా సొమ్ము అందకపోవడం విచారకమని తెలిపారు. చేనేత సహకార సంఘాలకు 12 ఏళ్లు గడుస్తున్నా ఎన్నికలు జరుపలేదని.. చేనేతశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఏడాది దాటిందని, తక్షణమే నిర్వహించి టెస్కోకు పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఉపాధి కల్పనకు ప్రభుత్వ రంగంలోని ఏకరూప దుస్తులకు మగ్గాలపై నేసిన వాటినే అందించాలని సూచించారు. కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం నాయకులు సాంబరి వెంకటస్వామి, పగిరాకుల రాములు, ఎంగలి రాజు, కొంగటి శ్రీనివాసులు, కొంగటి వెంకటయ్య, దిడ్డి శ్రీకాంత్, గోరంట్ల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.


