దళారులను నమ్మి మోసపోవద్దు
కొత్తకోట: వరి ధాన్యం విక్రయించడానికి కేంద్రాలకు వచ్చే రైతులకు నిర్వాహకులు సహకరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. శనివారం పట్టణంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన తనిఖీ చేసి ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. రైతులు ధాన్యం తీసుకొచ్చిన రోజే పూర్తి వివరాలు రికార్డుల్లో నమోదు చేసి తేమ శాతం పరిశీలించి టోకన్ నంబర్ల వారీగా కొనుగోలు చేయాలన్నారు. బరువు, తేమశాతం కొలిచే యంత్రాలు అందుబాటులో ఉంచుకొని ఎప్పటికప్పుడు ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. వాతావరణ మార్పుల దృష్ట్యా కేంద్రాల్లోని ధాన్యం తడవకుండా టార్పాలిన్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఆయన వెంట జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీ విశ్వనాథ్, జిల్లా పౌరసరఫరాలసంస్థ డీఎం జగన్మోహన్, ఇతర అధికారులు ఉన్నారు.
దళారులను నమ్మి మోసపోవద్దు


