వెలుగులోకి స్థానిక చరిత్ర..
మన ఊరు – మన చరిత్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం రెండేళ్ల కిందట ప్రారంభించింది. ఇందులో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లాలోని డిగ్రీ కళాశాలల విద్యార్థులు, ప్రొఫెసర్లు, ఔత్సాహిక చరిత్ర పరిశోధకుల బృందం పలు పురాతన గ్రామాలను ఎంచుకుని క్షేత్రస్థాయిలో పరిశోధన చేపట్టింది. ఒక గ్రామం గురించి అధ్యయనం మొదలుపెట్టినప్పుడు గ్రామానికి ఆ పేరు ఎలా వచ్చింది.. గ్రామానికి ఉన్న చారిత్రక మూలాలేంటి, గ్రామ భౌగోళిక, నైసర్గిక స్వరూపం, పురాతన ఆలయాలు, కట్టడాలు, చెరువులు, కొండల వంటి వివరాలు తెలుసుకుని గ్రామ చరిత్రను తెలుసుకున్నారు. గ్రామంలోని పురాతన ఆలయాలు, గడీలు, నాటి చరిత్ర, ఆనాటి సామాజిక పరిస్థితులను తెలుసుకునేందుకు గ్రామంలోని వృద్ధులు, స్వాతంత్య్ర సమరయోధులు, గ్రామ పెద్దలు, పురోహితులు, ఔత్సాహికుల నుంచి సమాచారాన్ని సేకరించారు.


