
సజావుగా ధాన్యం కొనుగోలుకు సన్నాహాలు
వనపర్తి: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వరి ధాన్యం కొనుగోలుకు తగిన ఏర్పాట్లు చేపట్టనున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఆదర్శ్ సురభి, రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ పాల్గొని వివరాలు వెల్లడించారు. ఈ నెల చివరి వారంలో ధాన్యం విక్రయానికి వచ్చే అవకాశం ఉందని.. ఆలోగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లావ్యాప్తంగా సుమారు 400 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు ప్రక్రియ చేపడతామన్నారు. అనంతరం కలెక్టర్ సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. గతంలో ఇబ్బందులు తలెత్తిన కేంద్రాల్లో సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని, రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని సూచించారు. తూకపు, తేమ కొలిచే యంత్రాలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలని, టార్పాలిన్లు, గన్నీబ్యాగులు అందుబాటులో ఉంచుకోవాలని, లారీలు, కూలీల కొరత తలెత్తకుండా చూడాలన్నారు. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడంలో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని కోరారు. సమావేశంలో డిప్యూటీ కలెక్టర్లు రంజిత్‌రెడ్డి, శ్రావ్య, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీ విశ్వనాథ్, డీఎం జగన్మోహన్, డీఆర్డీఓ ఉమాదేవి, డీసీఓ రాణి, డీటీఓ మానస, వ్యవసాయ అధికారి ఆంజనేయులుగౌడ్ పాల్గొన్నారు.