సా..గుతున్న పనులు | - | Sakshi
Sakshi News home page

సా..గుతున్న పనులు

Oct 15 2025 6:22 AM | Updated on Oct 15 2025 6:22 AM

సా..గ

సా..గుతున్న పనులు

ఎనిమిదేళ్లు గడుస్తున్నా పూర్తికాని డీ–8 కాల్వ నిర్మాణం

అసంపూర్తిగా మైనర్‌ కాల్వలు

227 స్ట్రక్చర్లకుగాను.. 95 మాత్రమే పూర్తి

త్వరగా పూర్తి చేయాలని కోరుతున్న రైతులు

నీరందేలా చూడాలి..

ప్రస్తుతం వర్షాలు అధికంగా కురుస్తుండటంతో సాగు నీరు అందుతోంది. మిగతా రోజుల్లో పరిస్థితి అధ్వానంగా ఉంటోంది. మా పొలం 30వ కిలోమీటర్‌ వద్ద ఉంది. ఇక్కడికి నీరు రావాలంటే ముందు రైతులకు తూములు తక్కువగా తెరిచి ఉంచడంతో పాటు లైనింగ్‌ పనులు సక్రమంగా చేస్తేనే చేరుతుంది. ఉన్నతాధికారులు స్పందించి పనులు పూర్తిస్థాయిలో త్వరగా చేపట్టాలి

– సోమ్లానాయక్‌, రేకులపల్లితండా, కోడేరు

స్ట్రక్చర్లు నిర్మించాలి..

మాకు మేజర్‌–2 కాల్వ నుండి సాగునీరు అందుతుంది. నీరు వచ్చే దగ్గర కేవలం రెండు గూనలు మాత్రమే ఏర్పాటు చేశారు. వాటి నుంచి కొన్నిసార్లు అధికంగా, మరికొన్నిసార్లు తక్కువగా రావడంతో కాల్వకు గండ్లు పడుతున్నాయి. గూనలు కాకుండా స్ట్రక్చర్‌ ఏర్పాటు చేయాలి.

– చంద్రశేఖర్‌,

మాజీ వైఎస్‌ ఎంపీపీ, గోపాల్‌పేట

ఏడాది సమయం కావాలి..

ఏటా పంటలు పూర్తయ్యాక పనులు చేయడానికి అవకాశం ఉండటంతో కేవలం రెండు నెలల సమయం మాత్రమే లభిస్తుంది. దీంతో పనులు ముందుకు సాగడం లేదు. ఎలాగైనా రైతులను ఒప్పించి ఒక పంట కాలాన్ని నిలిపివేస్తే పూర్తిస్థాయిలో చేపడతాం. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు సహకరిస్తే ఒక సీజన్‌లో అన్ని స్ట్రక్చర్లు, బ్రిడ్జిలు, ఇతర పనులన్నీ పూర్తవుతాయి.

– మధుసూదన్‌రావు,

ఈఈ, నీటిపారుదలశాఖ

చాకల్‌పల్లి సమీపంలో పారుతున్న డీ–8 మేజర్‌–2 కాల్వ

గోపాల్‌పేట: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలోని రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఎనిమిదేళ్ల కిందట ప్యాకేజీ 29లో భాగంగా ప్రధాన కాల్వకు 11.6 కిలోమీటర్ల వద్ద డీ–8 కాల్వ పనులు ప్రారంభించినా.. నేటికీ పూర్తి కాలేదు. అధికారులు ఏటా కాంట్రాక్టర్‌తో కొంతమేర పనులు చేపడుతున్నాగానీ పూర్తి కావడం లేదు. డి–8 కాల్వ నిర్మాణంలో భాగంగా ఏడు మేజర్‌ కాల్వలు, 17 మైనర్‌ కాల్వలు నిర్మించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు మేజర్‌ కాల్వలు అక్కడక్కడా కొన్ని పనులు మినహా దాదాపు పూర్తయ్యాయి. మైనర్‌ కాల్వలు ఇప్పటి వరకు ఆరు మాత్రమే పూర్తయ్యాయి. పనులు సరిగా చేపట్టడం లేదని ముందు టెండర్‌ దక్కించుకున్న కంపెనీని తొలగించి మరో ఏజెన్సీకి అప్పగించారు. సింగిల్‌లైన్‌ రోడ్‌ బ్రిడ్జి (ఎస్‌ఎల్‌ఆర్బీ), డబుల్‌లైన్‌ రోడ్‌ బ్రిడ్జి (డీఎల్‌ఆర్బీ)లు తదితర నిర్మాణాలు కలిపి మొత్తం 227కు పైగా స్ట్రక్చర్లు నిర్మించాల్సి ఉండగా.. గతేడాది అక్టోబర్‌ వరకు 70 పూర్తికాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 95 పూర్తి చేశారు. మిగతావి వచ్చే ఏడాది వరకు పూర్తి చేయిస్తామని అధికారులు చెబుతున్నారు.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో డీ–8 కాల్వ 34.4 కిలోమీటర్లు విస్తరించి ఉండగా.. 23 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉంటుంది. గోపాల్‌పేట, రేవల్లి, పాన్‌గల్‌, వనపర్తి మండలాలతో పాటు నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడేరు మండలంలోని కొన్ని గ్రామాలకు నీరందిస్తోంది. మేజర్‌–1 కాల్వ ద్వారా లక్ష్మీదేవిపల్లి, చెన్నారం, మేజర్‌–2 ద్వారా ఏదుట్ల, గోపాల్‌పేట, మేజర్‌–3 ద్వారా రేమద్దుల, తిర్మలాపూర్‌, అప్పాయిపల్లి, వనపర్తి మండలాలకు సాగునీరు అందుతోంది. మేజర్‌–4 కాల్వ ద్వారా కిష్టాపూర్‌, కిష్టాపూర్‌ తండా, గోప్లాపూర్‌, దావాజిపల్లి, దత్తాయిపల్లి, చందాపూర్‌ గ్రామాలకు నీరు అందుతోంది. మేజర్‌–6 కాల్వ ద్వారా రాజాపూర్‌, శాఖాపూర్‌, మాధవరావుపల్లి గ్రామాలకు సాగునీరు అందుతుందని అధికారులు చెబుతున్నారు. ఇటీవల అధికంగా కురిసిన వర్షాలతో రాజాపూర్‌, సింగాయిపల్లి గ్రామాలకు నీరు అందుతోందని.. లేకుంటే ఈ రెండు గ్రామాలకు నీరు పారక ఇబ్బందులు పడుతున్నామని ఆయా గ్రామాల రైతులు చెబుతున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకొని కాల్వలు బాగు చేయాలని కోరుతున్నారు.

సా..గుతున్న పనులు 1
1/2

సా..గుతున్న పనులు

సా..గుతున్న పనులు 2
2/2

సా..గుతున్న పనులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement