
నూనెగింజల సాగును ప్రోత్సహించాలి
కొత్తకోట రూరల్: జిల్లాలో సాగుచేసిన వేరుశనగకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని.. వరితో పోలిస్తే వేరుశనగ సాగుకు తక్కువ పెట్టుబడి, అధిక లాభాలు పొందవచ్చని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మంగళవారం పెద్దమందడి మండలం బలిజపల్లి రైతువేదికలో జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో జాతీయ నూనెగింజల ఉత్పత్తి పథకం కింద రాయితీ వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై రైతులకు సబ్సిడీపై కదిరి లేపాక్షి రకం వేరుశనగ విత్తనాలు పంపిణీ చేశారు. అక్కడికి వచ్చిన పలువురు రైతులతో మాట్లాడి పెట్టుబడి, దిగుబడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. రైతులు పంట మార్పిడి విధానం అవలంబించాలని, ఎప్పుడూ ఒకే రకం పంట కాకుండా నూనెగింజల సాగును కూడా చేపట్టాలని సూచించారు. వనపర్తి వేరుశనగకు అప్లోటాక్సిన్ అనే శీలింద్రం లేకపోవడంతో డిమాండ్ ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న వేరుశనగ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులుగౌడ్, తహసీల్దార్ పాండునాయక్, ఎంపీడీఓ, ఇతర అధికారులు పాల్గొన్నారు.