
ఎంఈఓ, జీహెచ్‌ఎం సస్పెన్షన్
● ఉత్తర్వులు జారీ చేసిన ఆర్జేడీ
వనపర్తిటౌన్: జిల్లాలోని కొత్తకోట ఎంఈఓ కృష్ణయ్య, మిరాసిపల్లి స్కూల్ కాంప్లెక్స్ జీహెచ్‌ఎం శ్రీనివాస్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ మంగళవారం ఆర్జేడీ విజయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. వీరిద్దరు పాఠశాలల పర్యవేక్షణను పట్టించుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శించారని, విధులకు హాజరుకాని ఉపాధ్యాయులకు వేతనాలు ఎందుకు చెల్లించాల్సి వచ్చిందని ఈ నెల 6న ఆర్జేడీ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారిచ్చిన సమాధానానికి సంతృప్తి చెందకపోవడంతో పాటు జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సస్పెండ్ చేసినట్లు సమాచారం.
దరఖాస్తుల ఆహ్వానం
వనపర్తిటౌన్: అంబేడ్కర్ ఓవర్సిస్ పథకంలో భాగంగా 2025–26 విద్యాసంవత్సరం విదేశీ విశ్వవిద్యాలయాల్లో పోసు్ట్రగాడ్యుయేషన్ చేయాలనుకునే విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ద్వారా రూ.20 లక్షల ఉపకార వేతనం అందుతుందని.. అర్హులైన విద్యార్థులు నవంబర్ 19వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
‘పది’ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి
పాన్‌గల్: పదోతరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ కోరారు. మంగళవారం మండలంలోని మాందాపూర్, చింతకుంట ఉన్నత పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదోతరగతి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి పరీక్షలపై పలు సూచనలు, సలహాలిచ్చారు. ప్రత్యేక తరగతులను సద్వినియోగం చేసుకొని సబ్జెక్టుల వారీగా సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. సమయం వృథా చేయకుండా లక్ష్యానికి అనుగుణంగా చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చన్నారు. ఆయన వెంట మండల విద్యాధికారి ఆనంద్, జీహెచ్‌ఎం సేక్యానాయక్, ఉపాధ్యాయ బృందం ఉన్నారు.
నేటి నుంచి
జిల్లాస్థాయి క్రీడా పోటీలు
వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని బాలకిష్టయ్య క్రీడా ప్రాంగణంలో జిల్లాస్థాయి క్రీడాపోటీలు బుధవారం నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఎస్జీఎఫ్ కార్యదర్శి బి.కుమార్ మంగళవారం తెలిపారు. బుధవారం అండర్–17 బాల బాలికలకు ఖోఖో, అండర్–14 బాల బాలికలకు వాలీబాల్, 16న అండర్–17 కబడ్డీ, అండర్–14 ఖోఖో, 17వ తేదీన అండర్–14, 17 చెస్ పోటీలు ఉంటాయన్నారు. చెస్ పోటీల్లో ప్రతి పాఠశాల నుంచి ఇద్దరు బాల బాలికలు పాల్గొనే అవకాశం ఉందని చెప్పారు. 18వ తేదీన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా చెస్‌పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఉమ్మడి పాలమూరు జట్టులో స్థానం సాధించిన వేణు, దామోదర్‌ను ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అభినందించారు. కార్యక్రమంలో పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.