
పీసీసీదే తుది నిర్ణయం
ఏఐసీసీ పరిశీలకుడు, పుదుచ్చేరి
మాజీ ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి
వనపర్తి/వనపర్తి టౌన్: కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకంలో తుది నిర్ణయం పీసీసీదేనని ఏఐసీసీ పరిశీలకుడు, పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి అన్నారు. మంగళవారం జిల్లాలో పర్యటించిన ఆయన ఉదయం జిల్లాకేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం అనంతరం దాచ లక్ష్మయ్య ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొత్త.. పాత అనే తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఆదేశాల మేరకు గతమెన్నడూ లేని విధంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పకడ్బంధీగా నిర్వహించాలని ఇతర ప్రాంతాల నుంచి ఏఐసీసీ పరిశీలకులను అధిష్టానం పంపించిందన్నారు. పార్టీ కోసం ఏళ్లుగా శ్రమించిన వారికి ప్రాధాన్యత క్రమంలో పదవులు వరిస్తాయని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తల అభీష్టం మేరకే డీసీసీ అధ్యక్షుల ఎంపికకు పార్టీ అధిష్టానం నూతన విధానాన్ని ఎంచుకుందన్నారు. ఆసక్తిగల వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని.. వారికి పార్టీ కార్యకర్తల్లో ఉన్న పేరు, పని చేసిన తీరుతెన్నులు తెలుసుకొని పీసీసీకి అందజేస్తామని.. ఈ నెల 22న తుది నిర్ణయం తీసుకుని డీసీసీ అధ్యక్షులను నియమిస్తారని చెప్పారు.
కాంగ్రెస్‌లో మార్పు మొదలైంది..
రాహుల్‌గాంధీ ఆలోచనల మేరకు పార్టీలో మార్పు మొదలైందని.. 46 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి విధానాలు ఎన్నడూ చూడలేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా అధిష్టానం కొత్త విధానాలను తీసుకొస్తుందని తెలిపారు. కనీసం పదేళ్ల పాటు పార్టీ కోసం పనిచేసిన, అనుభవం ఉన్నవారిని డీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేయాలనేది తన అభిప్రాయమని కార్యకర్తలు, నాయకులు, పరిశీలకుల సమక్షంలో వెల్లడించారు.
పరిశీలకుల నిర్ణయానికి కట్టుబడి ఉంటాం..
డీసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో పెద్దలు, ఏఐసీసీ పరిశీలకుల నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఎన్నికల కంటే ముందు పార్టీలో ఉన్న వారికే.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరుఫున పోటీచేసే అవకాశం కల్పిస్తామని, వారికే ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక ప్రజాస్వామ్యంగా జరిగేందుకు క్షేత్రస్థాయిలోని పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. సముద్రంలాంటి కాంగ్రెస్‌పార్టీలో చిన్నపాటి భేదాభిప్రాయాలు ఉండటం సాధారణమేనని తెలిపారు.