
సీఎంఆర్ గడువులోగా అప్పగించాలి
వనపర్తి: ఎఫ్‌సీఐకి అప్పగించాల్సిన సీఎంఆర్‌ను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో పౌరసరఫరాలశాఖ అధికారులు, రైస్‌మిల్లర్లతో సమావేశమై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2024–25 వానాకాలం సీజన్‌లో జిల్లాలోని మిల్లర్ల నుంచి 95,909 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ అప్పగించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 80,815 మె.ట. అందిందన్నారు. యాసంగి సీజన్‌కు సంబంధించి 1,57,796 మెట్రిక్ టన్నులకుగాను ఇప్పటి వరకు 61,710 మె.ట. మాత్రమే అప్పగించారని.. ఇంకా 96,697 మె.ట. బియ్యం మిల్లర్ల నుంచి రావాల్సి ఉందని చెప్పారు. గత వానాకాలం సీజన్‌కు సంబంధించి ఎఫ్‌సీఐకి అప్పగించాల్సిన బియ్యం గడువును నవంబర్ 12 వరకు పొడిగించినందున యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. మిల్లుల వారీగా పెండింగ్ వివరాలు వెల్లడించిన అదనపు కలెక్టర్ గడువులోపు అప్పగించాలని లేనిపక్షంలో బ్లాక్‌లిస్ట్‌లో ఉంచుతామని హెచ్చరించారు. మిల్లలను తనిఖీ చేసి వరి ధాన్యం ఉందా లేదా తనిఖీ చేస్తామని చెప్పారు. ఎఫ్‌సీఐ, పౌరసరఫరాలశాఖకు ఇచ్చే బియ్యంలో నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని.. నాసిరకంగా ఉంటే తిప్పిపంపుతామని తెలిపారు. సీఎంఆర్ సకాలంలో అందించకుంటే మిల్లులను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చడమేగాక యజమానులపై రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలుచేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి విశ్వనాథ్, పౌరసరఫరాల సంస్థ డీఎం జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్
ఎన్.ఖీమ్యానాయక్