
ప్రజల భద్రత బాధ్యత : ఎస్పీ
వనపర్తి: ప్రజల భాగస్వామ్యం, మహిళా సంఘాలు, విద్యార్థులు, మీడియాతో సమన్వయం పెంచుకోవాలని ఎస్పీ రావుల గిరిధర్ పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌హెచ్‌ఓలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఇటీవల డీజీపీ చేసిన సూచనలు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. చట్టాన్ని అమలు చేయడంతో పాటు ప్రజల్లో పోలీసింగ్‌పై నమ్మకం పెంపొందించాలని, ప్రజల విశ్వాసమే నిజమైన కొలమానమని తెలిపారు. యూనిఫాం ధరించడం గౌరవమని.. ప్రజలకు భద్రత, న్యాయం అందించడం బాధ్యతని చెప్పారు. అవినీతికి పాల్పడే వారితో పోలీసుశాఖ ప్రతిష్ట దెబ్బతింటుందన్న విషయాన్ని గమనించాలన్నారు. కుటుంబ వివాదాలు వచ్చినప్పుడు శాంతి, సర్దుబాటు దిశగా మార్గనిర్దేశం చేయాలని సూచించారు. సమావేశంలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, ఎస్‌బీ సీఐ నరేష్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు, సీసీఎస్ ఎస్‌ఐ రామరాజు, డీసీఆర్బీ ఎస్‌ఐ తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫొటోగ్రఫీ, షార్ట్‌ఫిల్మ్, వ్యాసరచన పోటీలు..
పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు ఫొటోగ్రఫీ, షార్ట్‌ఫిల్మ్, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నందున ఈ నెల 23లోగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫొటోలు, వీడియోలు అందజేయాలని ఎస్పీ రావుల గిరిధర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముగ్గురు విజేతలను ఎంపిక చేసి బహుమతులు అందజేయడంతో పాటు రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు సెల్‌నంబర్ 87126 70597 సంప్రదించాలని సూచించారు.