స్వరాష్ట్రంలో అద్భుత పురోగతి | Sakshi
Sakshi News home page

స్వరాష్ట్రంలో అద్భుత పురోగతి

Published Mon, Sep 18 2023 1:28 AM

విద్యార్థుల నృత్య ప్రదర్శనలు  - Sakshi

వనపర్తి: తెలంగాణ ప్రజలు 76 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఆరు దశాబ్దాల పాటు అస్థిత్వం కోసం పోరాడారని.. దాని ఫలితమే నేడు స్వరాష్ట్రంలో అద్భుతమైన పురోగతి సాకారమవుతోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం సమీకృత కలెక్టరేట్‌లో నిర్వహించిన వేడుకలకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై జెడ్పీ చైర్మన్‌ ఆర్‌.లోక్‌నాథ్‌రెడ్డి, కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌, ఎస్పీ రక్షిత కె.మూర్తితో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. చరిత్రలో 1948, సెప్టెంబర్‌ 17కు ఓ విశిష్టత ఉందని.. 76 ఏళ్ల క్రితం ఇదే రోజున మన తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమైందని, రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిందని వివరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహిస్తోందన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ నెలకొల్పిన సామరస్య విలువలు, జవహర్‌లాల్‌ నెహ్రూ కల్పించిన విశ్వాసం, మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ నెలకొల్పిన మతాతీత దేశభక్తి భావన, దేశానికి తొలి హోంమంత్రి సర్దార్‌ వల్లబ్‌భాయ్‌ పటేల్‌ ప్రదర్శించిన చాకచక్యంతో సంస్థానాలు భారత్‌లో విలీనమై దేశం ఏకీకృతమైందని వివరించారు. తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్ఛను పొందడానికి నాటి యావత్‌ సమాజం ఉద్యమించిందని.. నాటి అపురూప ఘట్టాలు జాతి జీవనంలో నిరంతరం సజీవంగా నిలిచిపోతాయన్నారు. నాటి ఉజ్వల ఘట్టాలు, వెలకట్టలేని యోధుల త్యాగాలను స్మరించుకోవటం బాధ్యతని తెలిపారు. ఆదివాసీ యోధుడు కుమురంభీమ్‌, తన ధైర్యసాహసాలతో చరిత్రను వెలిగించిన దొడ్డి కొమురయ్యతో పాటు నాటి పోరాటానికి నాయకత్వం వహించిన మహనీయులు రావి నారాయణరెడ్డి, స్వామి రామానందతీర్ధ, భీంరెడ్డి నర్సింహారెడ్డి, వీరవనిత చాకలి ఐలమ్మ, ప్రజా ఉద్యమానికి సేనాధిపతిగా నిలిచిన ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మభిక్షంగౌడ్‌, దేవులపల్లి వెంకటేశ్వర్‌రావు, బద్దం ఎల్లారెడ్డి వంటి ప్రజానేతల త్యాగాలను సగర్వంగా స్మరించుకోవాలన్నారు. తన అక్షరాలతో ప్రజల్లో ఉత్తేజాన్ని నింపిన సురవరం ప్రతాపరెడ్డి, ప్రజాకవి కాళోజి, మొగ్ధుం మొహినుద్దీన్‌, దాశరథి కృష్ణమాచార్య, సుద్దాల హనుమంతు, బండి యాదగిరి, షోయబుల్లాఖాన్‌ వంటి సాహితీమూర్తులకు ఈ సందర్భంగా నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. జాతీయ సమైక్యత అంటే భౌగోళిక సమైక్యత మాత్రమే కాదని.. ప్రజల సమైక్యత, విభిన్న సంస్కృతుల సమ్మేళనమని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. దేశం అనుసరిస్తున్న జీవనసూత్రం భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడడమే నిజమైన దేశభక్తి అన్నారు. స్వరాష్ట్రంలో విద్యార్థులకు ఉన్నత విద్య చేరువైందని.. రాష్ట్రంలో ప్రస్తుతం వైద్యవిద్యలో సీట్ల సంఖ్య 2,850 నుంచి 8,515కు పెరిగిందని తెలిపారు. ఒకటి నుండి పదో తరగతి వరకు సర్కార్‌ బడి పిల్లలకు అల్పాహారం అందించే వినూత్న పథకానికి దసరా పండుగ నుంచి అమలు కానుందన్నారు. రాష్ట్రంలోని 29 వేల ప్రభుత్వ పాఠశాలల్లోని 22 లక్షలకు పైగా విద్యార్ధులు లబ్ధి పొందుతారని వెల్లడించారు.

జాతీయజెండా ఆవిష్కరించిన అనంతరం సెల్యూట్‌ చేస్తున్న

మంత్రి నిరంజన్‌రెడ్డి,

కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌,

ఎస్పీ రక్షిత కె.మూర్తి తదితరులు

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి

సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

ఆకట్టుకున్న ప్రదర్శనలు..

ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నృత్యాలు చేసిన చిన్నారులను మంత్రి నిరంజన్‌రెడ్డి, కలెక్టర్‌, ఎస్పీ అభినందించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణంలో విశిష్ట కృషి చేశారని మంత్రి నిరంజన్‌రెడ్డిని కలెక్టర్‌, జిల్లా అధికారులు శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించారు. అనంతరం బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విశ్వకర్మ జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్‌ ఎస్‌.తిరుపతిరావు, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్‌ బి.లక్ష్మయ్య, జిల్లా అధికారులు, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులు, కలెక్టరేట్‌ సిబ్బంది, కళాకారులు, చిన్నారులు పాల్గొన్నారు.

వలసల జిల్లా పాలమూరు రూపురేఖలు స్వరాష్ట్రంలో మారిపోయాయని.. సీఎం కేసీఆర్‌ సారథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం, అతిభారీ మోటార్లతో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఘట్టాలని మంత్రి వివరించారు. పాలమూరుతో శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను ఎత్తిపోసి మొదటి దశలో 70 మండలాల్లోని 1,226 గ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. రెండో దశలో 6 జిల్లాలు.. 19 నియోజకవర్గాల్లోని 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. 5 లిఫ్ట్‌లు, 67.52 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో ఆరు భారీ రిజర్వాయర్లను నిర్మించామని తెలిపారు. ఈ పథకంలో ప్రపంచంలోనే అతిభారీ మోటార్లు ఒక్కొక్కటి 145 మెగావాట్ల సామర్ధ్యం గల 31 బాహుబలి పంపులను, 75 మెగావాట్ల సామర్థ్యం గల 3 పంపులను ఉపయోగించినట్లు వివరించారు.

1/1

Advertisement
 
Advertisement