వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు నుంచి శనివారం 2వేల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదైంది. సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి 2వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులో చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద 64.60 మీటర్ల నీటిమట్టం నమోదైంది. ఒక గేటు ఎత్తి 1250 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెట్టగా, కుడి ప్రధాన కాలువ నుంచి ఆయకట్టు భూములకు 750 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నామని డీఈ పి.అర్జున్ తెలిపారు.
126 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు
● జేసీ సేతు మాధవన్
విజయనగరం ఫోర్ట్: ఖరీఫ్ 2026–27 సీజన్‌లో ధాన్యం కొనుగోలుకు 261 రైతు సేవా కేంద్రాలను ప్రతిపాదించినట్టు జేసీ ఎస్.సేతుమాధవన్ తెలిపారు. అధికారులతో శనివారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో 171 రైస్ మిల్లులకు గాను 152 మిల్లులు స్వీయ ప్రకటనలు పూర్తయినట్టు తెలిపారు. 114 మిల్లులు తనిఖీలు పూర్తి కాగా 38 మిల్లులు తనిఖీలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. 4,356 వాహనాలు అవసరం కాగా ఇప్పటి వరకు 117 వాహనాలు మాత్రమే రిజిస్టర్ అయినట్టు చెప్పారు. ఈ కాన్ఫరెన్స్‌లో వ్యవసాయశాఖ జేడీ ఎం.రామారావు, డీఎస్‌ఓ మురళీనాథ్, సివిల్ సప్‌లై డీఎం శాంతి, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పోలీస్‌శాఖలో చేరిన ‘చీతా’
విజయనగరం టౌన్: జిల్లా పోలీస్ శాఖలో విధుల నిర్వహణకు చీతా అనే పోలీస్ డాగ్ చేరింది. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఏఆర్ దామోదర్‌కు తనదైన శైలిలో శనివారం సెల్యూట్ చేసింది. భోగాపురంలో ఏఎస్‌ఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ భద్రత, గంజాయి అక్రమ రవాణా నియంత్రణకు జిల్లా పోలీసుశాఖ చేపడుతున్న చర్యల్లో ‘చీతా’ భాగస్వామ్యం అవుందని ఎస్పీ తెలిపారు. డచ్‌పెపర్డ్ బ్రీడ్‌కు చెందిన చీతా ఐఎస్‌డబ్ల్యూ ఆధ్వర్యంలో మంగళగిరిలో పదినెలల శిక్షణలో ట్రాకింగ్, నార్కోటిక్ విభాగాల్లో మంచి నైపుణ్యం కనబర్చినట్టు ఎస్పీ తెలిపారు. ప్రపంచ జంతు దినోత్సవం రోజున ‘చీతా’ విధుల్లో చేరడం శుభదాయకమన్నారు. డాగ్ హ్యాండ్‌లర్స్‌గా ఏఆర్ కానిస్టేబుళ్లు ఎం.శ్రీనివాసరావు, వై.శివాజీలు వ్యవహరించనున్నారు.
ఉద్యోగ భద్రత కల్పించండి
విజయనగరం గంటస్తంభం: వీబీజీ రామ్‌జీ పథకంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనం రూ.26,000 చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఫీల్డ్ అసిస్టెంట్ల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టరేట్‌లో అధికారులకు జేఏసీ నాయకులు శనివారం వినతిపత్రం అందజేశారు. 19 ఏళ్లుగా సేవలందిస్తున్నప్పటికీ ప్రస్తుతం ఇస్తున్న రూ.5,745 వేతనంతో కుటుంబాలు గడవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ తొలగింపులను వెంటనే నిలిపివేయాలని, అర్హులైన వారికి పదోన్నతులు, బదిలీ సౌకర్యం కల్పించాలని కోరారు. మూడేళ్లు పూర్తయిన వారందరికీ ఎఫ్‌టీఈ వర్తింపజేయాలని, ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.


