విజయనగరం గంటస్తంభం: జిల్లాలో త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై శనివారం కలెక్టరేట్‌లో ఆయన సమీక్షించారు. జిల్లాలోని 27 మండలాల పరిధిలో 449 ఎంపీటీసీ, 27 జెడ్పీటీసీ స్థానాల ఎన్నికలకు 1,586 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు. 2026 ఏప్రిల్ 15 నాటి ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికలు జరుగుతాయని, వార్డులు, పంచాయతీల వారీగా జాబితాలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో తాగునీరు, విద్యుత్, ర్యాంప్, షెడ్డు వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. 3,185 బ్యాలెట్ బాక్సుల మరమ్మతులు, పోలింగ్ సిబ్బంది శిక్షణ, వాహనాల ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికల వివరాలను ఎప్పటికప్పుడు ఎస్‌ఈసీ పోర్టల్‌లో నమోదు చేయాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమీక్షలో జేసీ ఎస్.సేతుమాధవన్, జెడ్పీ సీఈవో లవరాజు, డీపీవో మల్లికార్జునరావు, తదితరులు పాల్గొన్నారు.
ఏర్పాట్లను ముమ్మరం చేయాలి
1,586 పోలింగ్ కేంద్రాల్లో పక్కాగా మౌలిక వసతులు
ఎన్నికల సన్నద్ధతపై అధికారులతో కలెక్టర్ సమీక్ష


