ప్రతిపాదనలు కను‘మరుగు? | - | Sakshi
Sakshi News home page

ప్రతిపాదనలు కను‘మరుగు?

Sep 18 2026 12:57 AM | Updated on Sep 18 2026 12:57 AM

పశువైద్యశాలల్లో మరుగుదొడ్ల

నిర్మాణానికి కానరాని చర్యలు

స్వచ్ఛాంధ్ర నిధులతో ఏర్పాటుకు

ఏడెనిమిది నెలల క్రితం ప్రతిపాదనలు

జిల్లాలో 85 చోట్ల మరుగుదొడ్లుకు రూ.1.40 కోట్లు మంజూరుకు ప్రతిపాదనలు పంపిన అధికారులు

నిధులు లేవంటూ కాలయాపన

అవస్థలు పడుతున్న సిబ్బంది

నిధులు విడుదలైన వెంటనే నిర్మాణాలకు చర్యలు

రామభద్రపురం: స్వచ్ఛతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. ఇందులో భాగంగా పశువైద్యశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని కూటమి ప్రభుత్వ పాలకులు ప్రచార ఆర్బాటాలు చేశారు. అలాగే ఏఏ పశువైద్యశాలల్లో మరుగుదొడ్లు అవసరమో,ఎంత నిధులు అవసరమో నివేదికల రూపంలో ప్రతిపాదనలు తయారు చేసి పంపించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.దాంతో హమ్మయ్యా ఏళ్లుగా ఉన్న సమస్య తీరిపోతుందని సంబరపడి పశువైద్యశాఖాదికారులు ప్రతిపాదనలు తయారు చేసి పంపించారు.అయితే ఆ ప్రతిపాదనలు చెత్తబుట్టలోకి వెళ్లాయో ఏమో గాని ప్రతిపాదనలు పంపించి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ మరుగుదొడ్ల నిర్మాణాలకు చర్యలు కానరావడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

85 పశువైద్యశాలలకు రూ.1.40 కోట్లతో ప్రతిపాదనలు

వ్యవసాయం తర్వాత పాడిపోషణే ఎక్కువ మందికి జీవనాధారం.వ్యాధుల బారిన పడే పశువులకు వైద్యం అందించేందుకు ఆస్పత్రులలో చాలా చోట్ల మరుగుదొడ్లు లేవు. మరికొన్ని చోట్ల ఉన్న అవి దశాబ్దాల క్రితం నిర్మించినవి కావడంతో వినియోగానికి వీలు లేని విధంగా పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛభారత్‌ నిధులతో 85 పశువైద్యశాలల్లో మరుగుదొడ్లు నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేసి పంపించారు. ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి సుమారు రూ.1,65 లక్షలు చొప్పున రూ.1,40,25,000 నిధులు అవసరమని అంచనా వేసి ప్రతిపాదనలు పంపించారు. అయితే ఇప్పటి వరకు పైసా విడుదల కాలేదు. ఆ ప్రతిపాదనలకు నిధులు మంజూరు చేయడంలో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శలు ఉన్నాయి. పశువైద్యశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక సిబ్బంది,ఆస్పత్రులకు పశువులు తీసుకొచ్చిన పాడిరైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

చెప్పుకోలేక సిబ్బంది అవస్థలు

ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నామంటూ ప్రచారాలు తప్ప వాటి ఆచరణకు సరైన సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం దృష్టిపెట్టడంలేదు. పశువైద్యశాలల్లో మూత్రశాలలు,మరుగుదొడ్లు లేక సిబ్బంది,ఆస్పత్రులకు పశువులు తీసుకొచ్చిన పాడిరైతులు ఇబ్బందులు పడుతున్నారు.ఇందులో మహిళల పరిస్థితి చెప్పుకోలేని స్థితిలో ఉంటోంది. కొన్ని చోట్ల ఉన్నా శిథిలావస్థకు చేరడంతో పాటు వాటి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో అత్యవసర సమయంలో మూత్రానికి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మధుమేహం ఉన్న వారు తరుచూ మూత్రశాలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో పురుషులు మహిళలు సిగ్గుపడుతూ ఒంటికీ, రెంటికీ తుప్పల చాటుకు వెళ్లాల్సిన దుస్థితి. లేందటే ఉగ్గబట్టుకుని ఉండాల్సిన పరిస్థితి ఉంది. గంటల తరబడి మూత్రం ఉగ్గబట్టుకున్నా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికై నా నిధులు విడుదల చేసి పశువైద్యశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సిబ్బంది, పాడిరైతులు కోరుతున్నారు.

కొట్టక్కి పశువైద్యశాలలో పాడిపశువుకు వైద్య పరీక్షలు చేస్తున్న మహిళా సిబ్బంది

జిల్లాలో అవసరమైన 85 పశువైద్యశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు తయారు చేసి పంపించాం. ప్రస్తుతం ప్రాసెస్‌లో ఉంది.నిధులు విడుదలైన వెంటనే నిర్మాణాలకు చర్యలు చేపడతాం.

ఎస్‌.మన్మథరావు,

జేడీ, జిల్లా పశువైద్యశాఖ, విజయనగరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement